ఏపీలో ప్రతిపక్షాలు ఉన్నా లేనట్లేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ సమావేశమయినపుడు విశాఖ ఏజన్సీలలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై కూడా వారిరువురూ చర్చించారు. ఆ ఆలోచన విరమించుకోమని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి నచ్చజెప్పాలనుకొంటే, ముఖ్యమంత్రే అందులో ఎటువంటి తప్పు లేదని పవన్ కళ్యాణ్ కి నచ్చజెప్పి పంపించేసారు. పైగా అది రాజశేఖర్ రెడ్డి హయంలో తీసుకొన్న నిర్ణయమే తప్ప కొత్తగా తీసుకొన్నది కాదని పవన్ కళ్యాణ్ చేతనే ప్రజలకు చెప్పించగలిగారు. కనుక ఇక బాక్సైట్ తవ్వకాలకు పవన్ కళ్యాణ్ తరపు నుండి ఇక ఎటువంటి అభ్యంతరం ఉండదనే భావించవచ్చును. రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి రాజధాని నిర్మాణానికి ఇంకా భూసేకరణ చేయడం, ప్రత్యేక హోదా వంటి వివిధ అంశాలపై పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన చూసి ప్రజలు చాలా నిరాశ చెందారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర డి.జి.పి. జె.వి.రాముడు కూడా సరిగ్గా ముఖ్యమంత్రి అభిప్రాయాలనే ప్రతిబింబిస్తున్నట్లు మాట్లాడం గమనార్హం. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచించి బాక్సైట్ తవ్వకాలను అనుమతించాలని నిర్ణయం తీసుకొంది. నిజానికి గత ప్రభుత్వ హయంలోనే దీనిపై నిర్ణయం జరిగి కొన్ని కంపెనీలకు అనుమతులు కూడా మంజూరు చేసింది. కనుక ఇది కొత్తగా తీసుకొన్న నిర్ణయమేమీ కాదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొన్న తరువాత దాని అమలు చేయడానికి భద్రతాపరంగా అవసరమయిన సహకారం అందించాల్సిన బాధ్యత మా పోలీస్ శాఖపై ఉంటుంది. కనుక బాక్సైట్ తవ్వకాలకు ఎవరివల్లా ఆటంకం కలుగకుండా అవసరమయిన భద్రత కల్పిస్తాము,” అని తెలిపారు. అంటే ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే ఉద్దేశ్యం లేదని స్పష్టం అవుతోంది.

బాక్సైట్ తవ్వకాలను స్థానిక గిరిజనులు, ప్రజా సంఘాలు, వైకాపాతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 2వ తేదీన పాడేరులో బాక్సైట్ తవ్వకాలు జరుగబోయే ప్రదేశాన్ని పర్యటించి అక్కడే ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దానికి అనుమతి కోరుతూ వైకాపా దరఖాస్తు చేసుకొంటే పరిశీలిస్తామని డి.జి.పి. జె.వి.రాముడు తెలిపారు. అంటే ప్రతిపక్షాల ఆందోళనలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగానే ఉందని స్పష్టం అవుతోంది.

ఇది చాలా తీవ్రమయిన సున్నితమయిన సమస్యే కానీ ప్రభుత్వాన్ని నిలువరించేవారే లేరు. పవన్ కళ్యాణ్ ప్రజల తరపున నిలబడి పోరాడుతారని అందరూ ఆశించారు. కానీ ఆయన తెదేపాకు అనుబంధ సభ్యుడిగా మారిపోయారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదు కనుక దాని అభ్యంతరాలను ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్నందున గట్టిగా ప్రశ్నించలేకపోతోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ సమస్యపైనా నిలకడగా కొన్ని రోజులు పోరాటం చేసే అలవాటు లేదు. ఒకవేళ పోరాడినా తను ముఖ్యమంత్రి అయితే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావని చెపుతుండటంతో ప్రజల మద్దతు పొందలేకపోతున్నారు.

గిరిజనుల జీవితాలను బుగ్గి పాలు చేసే బాక్సైట్ తవ్వకాలకు అనుమతించడం, రాజధాని కోసం, విమానాశ్రయాల నిర్మాణం కోసం మూడు పంటలు పండే సారవంతమయిన భూముల సేకరణ, దాని కోసం రైతులపై భూసేకరణ చట్ట ప్రయోగానికి వెనుకాడకపోవడం వంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీసుకొంటోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేవారు లేనందునే ఎన్ని అభ్యంతరాలు ఎదురవుతున్నా ప్రభుత్వం దైర్యంగా ముందుకే వెళ్ళగలుగుతోందని చెప్పవచ్చును. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాభీష్టాన్ని, వారి అభ్యంతరాలను పట్టించుకోకపోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు కానీ ఎన్నికలలో దానికి మూల్యం చెల్లించవలసి వస్తే అప్పుడు ఎంత పశ్చాతాపపడినా ప్రయోజనం ఉండదని గ్రహిస్తే మంచిది కదా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com