భగవంతుడా! వీళ్ళని ఎందుకు పుట్టించావు?

బహుశః పురాణాలలో రాక్షసులు కూడా ఇంత పైశాచికంగా వ్యవహరించి ఉండరేమో? సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదులను నరరూప రాక్షసులనాలో లేక అంతకంటే ఇంకా భయంకరమయిన మానవ మృగాలు అనాలో తెలియడం లేదు. తమకు బందీలుగ చిక్కినవారిని ఎన్ని రకాలుగా హింసించవచ్చో అంతగాను హింసిస్తూ పైశాచిక ఆనంద అనుభవిస్తున్నారు. ఒక మనిషిని ఎన్ని రకాలుగా చంపవచ్చో అది కూడా చేస్తున్నారు. వారికి చిన్న పిల్లలు, మహిళలు, గర్భవతులు, వృద్ధులు అని తేడా లేదు. ఎవరిపట్ల అయినా అంతే క్రూరంగా వ్యవహరిస్తూ చాలా దారుణంగా హత్యలు చేస్తుంటారు. ఐసిస్ ఉగ్రవాదులు తాజాగా విడుదల చేసిన “హైడ్ అండ్ సీక్” వీడియోని చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

చిన్న పిల్లలు దొంగా-పోలీస్ ఆటలు ఆడుకోవడం మనకి తెలుసు. ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదులు చిన్న పిల్లలతో అదే ఆటలు ఆడిస్తున్నారు. ఈ ఆటలో అభం శుభం తెలియని చిన్నపిల్లల చేతుల్లో నిజమయిన తుపాకులు పెట్టి చీకటి గుహలలో చేతులు వెనక్కి విరిచి కట్టి బందించి ఉన్న బందీలను కనిపెట్టి కాల్చి చంపాలి. ఇదే వారు ఇప్పుడు ఆడుతున్న ఆట! సిరియాలోని డేయిర్ ఆజోర్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉన్న కొన్ని పురాతన కట్టడాలలో, అల్ రభా కోటలో ఈ దారుణమయిన క్రీడా జరుగుతోంది.

ఉగ్రవాదులుగా శిక్షణ పొందుతున్న చిన్న పిల్లలు చీకటి గుహలలో ఉగ్రవాదులు దాచి ఉంచిన బందీలను కనిపెట్టి వారిని చంపి రావాలి. ఆ తరువాత మరో పిల్లాడు తుపాకీ పట్టుకొని లోపలకి వెళ్లి ఇంకో బందీని చంపి వస్తాడు. ఇలాగ లోపల ఉన్న బందీలు అందరూ చనిపోయే వరకు ఈ “హైడ్ అండ్ సీక్” ఆట సాగుతూనే ఉంటుంది. ఇటువంటివి అన్నీ వింటుంటే భగవంతుడా…ఇటువంటి నరరూప రాక్షసులను ఎందుకు పుట్టించావు? ఇంకా ఎంత కాలం ఈ నరమేధం? అని బాధపడకుండా ఉండలేము.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com