కల్కితో ప్రారంభం..! హిట్‌లిస్ట్‌లో ఇతర స్వాములు కూడా..!?

కల్కిభగవాన్, అమ్మా భగవాన్ పేరుతో భక్తి వ్యాపారం చేసిన వారి గుట్టును ఐటీ రట్టు చేసింది. వందల కోట్ల ధనాన్ని ఎలా సంపాదించారో కానీ… గుట్టలు గుట్టలుగా పడి నగదును.. దేశం దాటించిన సంపదను.. కనిపెట్టారు. ప్రస్తుతం.. ఆ పుట్టను ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో పగులగొట్టి.. మిగతా వ్యవహారాలను పూర్తి చేయనున్నారు. అయితే.. కల్కిభగవాన్ సాదాసీదా స్వామిజీ కాదు. ఆయన హైప్రోఫైల్ స్వామి. ఆయనకు అండదండలు ఎక్కువగానే ఉంటాయి. అయినా.. కూడా ఐటీ అధికారులు ఏ మాత్రం సంకోచించకుండా దాడులు చేశారు. ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో.. ఆ ఒక్క స్వామిజీ కాదని… వారి హిట్‌లిస్ట్‌లో ఇంకా చాలా మంది స్వాములున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఇటీవలి కాలంలో.. రాజకీయాల్లో స్వాముల పాత్ర పెరిగింది. ఎవరో ఒక పార్టీకి అండగా ఉండటం.. వారి కోసం యజ్ఞయాగాదులు చేస్తున్నట్లుగా ప్రకటనలు చేయడం.. తర్వాత వారికి ఆత్మీయంగా మారిపోయి.. సంపదను.. పోగేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ స్వాముల హడావుడి ఎక్కువగా ఉంది. అయితే.. చాలా మంది నిస్వార్థంగా… ఆధ్యాత్మిక సేవలో గడుపుతూంటారు. ఇలాంటి వారికి మఠాలుంటాయి. ఈ మఠాధిపతులు రాజకీయాల్లో వేలు పెట్టనే పెట్టరు. కర్ణాటకలో ఇలాంటి వారు ఎక్కువగా ఉంటారు. తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో మాత్రం.. రాజకీయ స్వాములు ఎక్కువైపోయారు. ఒకప్పుడు… చిన్న చిన్న దుకాణాలు నిర్వహించుకున్న వారు ఇప్పుడు బడా స్వాములుగా ఎదిగిపోయి… వీఐపీలుగా చెలామణి అవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

వీరందరితో.. ఓ హిట్ లిస్ట్ తయారయిందన్న ప్రచారం.. ఐటీ వర్గాల్లో కూడా ప్రారంభమయింది. కల్కి ఆశ్రమం గుట్టు రట్టు చేసిన తర్వాత.. ఏపీలోని మరో ప్రముఖ స్వామి విషయాన్ని కూడా తేల్చే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేతకు.. అత్యంత సన్నిహితంగా ఉండే… ఆ స్వామి ఇటీవలి కాలంలో రాజకీయంగా బాగా యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వాల నుంచి అప్పనంగా ప్రయోజనాలు పొందుతున్నారు కూడా. ఈ క్రమంలో.. ఆ స్వామిపై కూడా.. ఐటీ దాడులు జరిగితే.. ఇక ఆధ్యాత్మిక వ్యాపారం చేసే వారికి… వెన్నులో వణుకు ప్రారంభమైనట్లే. మరి ఐటీ అధికారులు ఏం చేయబోతున్నారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com