ఒక్క హిట్టు పడగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ లెవల్స్ అమాంతంగా పెరిగిపోతుంటాయి. మనం ఏం చేసినా చెల్తా అనే నమ్మకం ఏర్పడుతుంది. ధృవతో రామ్‌చరణ్‌కీ ఇలాంటి ఫీలింగ్సే కలిగి ఉంటాయి. అందుకే… సుకుమార్ సినిమాపై ఆ ప్రభావం పడబోతోంది. నిజానికి ముందు నుంచీ ఈ సినిమాని తన కంట్రోల్లోకి తెచ్చేసుకొన్నాడు రామ్ చరణ్. టెక్నీషియన్ల ఎంపికలో పూర్తిగా తన ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తోంది. కెమెరా మెన్ దగ్గర్నుంచి, ఆర్ట్ డైరెక్టర్ వరకూ.. అందరూ చరణ్ రికమెండేషన్ తో టీమ్‌లోకి వచ్చిన వాళ్లే. ధృవ ఎప్పుడైతే హిట్ అయ్యిందో..మరింత పట్టుబిగించడం మొదలెట్టాడు. ఈ సినిమాకి పూర్తిగా కొత్త స్టైల్ లో చేయాలనుకొంటున్నాడు సుక్కు. తన సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే విషయాలేం ఇందులో ఉండకూడదని జాగ్రత్త పడుతున్నాడట. అందులో భాగంగానే ఐటెమ్ సాంగ్ ని పక్కన పెట్టేశాడట. నాన్నకు ప్రేమతో సినిమాలోనూ ఐటెమ్ గీతం లేదు. సేమ్ టూ సేమ్ అదే ఫార్ములా చరణ్ సినిమాలోనూ అప్లయ్ చేద్దామనుకొంటున్నాడు సుక్కు.
కానీ చరణ్ మాత్రం ‘ఐటెమ్ సాంగ్ కావాల్సిందే’ అంటున్నాడని వినికిడి. ధృవ సినిమాలో మాస్‌ని మెప్పించే అంశాలేం లేవు. చరణ్ డాన్సింగ్ టాలెంట్ చూపించే సందర్భమూ చిక్కలేదు. తదుపరి సినిమాలోనూ మసాలా తగ్గిపోతే తన ఫ్యాన్స్ నిరుత్సాహపడతారని చరణ్ భయపడుతున్నాడట. పైగా సుక్కు సినిమా ప్రత్యేక గీతాలకు ఫేమస్. సుక్కు – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ప్రతీ ఐటెమ్ సాంగూ.. ట్రెండ్ సృష్టించింది. మరోవైపు చరణ్ కొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగులు చేసినా.. అవంతగా పేలలేదు. అందుకే ఈసారి ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని చరణ్ భావిస్తున్నాడట. ఈ విషయమై చరణ్ దేవిశ్రీతోనూ మాట్లాడేశాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే అని పట్టుపడుతున్నాడని తెలుస్తోంది. హీరోగారు చెబితే `నో` అనకుండా ఎలా ఉంటాడు. అందుకే సుక్కూ కూడా కాస్త మెత్తబడినట్టు తెలుస్తోంది.