తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమయింది . ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతున్నాయి. పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధుల్ని రాబట్టుకునేందుకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందని అందుకే .. రిజర్వేషన్ల అంశం తేలకపోయినా .. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇప్పుడు ఇతర పార్టీలు అనివార్యంగా ఎన్నికలకు సిద్ధం కావాల్సిందే. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుందన్నది ఆ పార్టీ క్యాడర్ లోనూ అసక్తికరంగా మారింది.
పంచాయతీ ఎన్నికల్లో ఎలా గెలవాలో చూపించిన కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో లోకల్ పోల్స్ కాస్త విలువలతో జరిగేవి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో పై స్థాయి నేతలు కలుగచేసుకునేవాళ్లు కాదు. గ్రామంలోని వారే తేల్చుకునే అవకాశం కల్పించేవారు. వారు వేలం వేసుకుంటారా.. పోటీలు పడతారా అన్నది పట్టించుకునేవారు కాదు .కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత అంతా సీన్ మారిపోయింది. పార్టీ గుర్తు లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారే సర్పంచ్‌గా గెలవాలని పట్టుదల చూపేవారు. వారు ఇతర పార్టీల నుంచి వచ్చి ఉంటారు. అలా అందర్నీ బీఆర్ఎస్ ఖాతాలో చేర్చేసి..ఎన్నికల్లో స్వీప్ చేసేవారు. కేసీఆర్ చూపించిన ఆ మార్గం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఉంది. ఇంకా చెప్పాలంటే.. కేసీఆర్ ఏక్ నెంబర్ అయితే.. రేవంత్ దస్ నెంబర్. అంత కంటే ఎక్కువే చేస్తారు.
గ్రామ స్థాయిలో స్వీప్ చేయాలని రేవంత్ ప్లాన్
90 శాతానికిపైగా పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఇప్పటికే రేవంత్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 12వేలకుపైగా ఉన్న పంచాయతీల్లో పది నుంచి పదకొండు వేల పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచేలా ఆయన ప్రణాళికలు వేస్తున్నారు. ఇది అసాధ్యమేమీ కాదని గతంలో జరిగిన ఎన్నికలే నిరూపించాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీపడాలంటే బీఆర్ఎస్.. చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏకపక్షంగా తమ పార్టీకి మద్దతుగా ఉన్న గ్రామాల్లో మాత్రమే వారు పోటీ చేయగలరు. కానీ అధికారం పోయిన తర్వాత అలాంటి గ్రామాలు చాలా పరిమితంగా ఉన్నాయి. క్యాడర్ వలస పోవడంతో .. అలాంటి గ్రామాల్లోనూ అధిపత్య పోరాటాలు ప్రారంభమయ్యాయి.
నామినేషన్ల ప్రారంభం తర్వాత అక్రమాల పేరుతో బహిష్కరించే చాన్స్
రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో బీఆర్ఎస్ నేతలకు తెలియకుండా ఉండదు. నేతలు కూడా.. తమకు పట్టు ఉన్న ప్రాంతాలను కూడా వదిలేసుకోవాల్సి రావొచ్చు. ఆ సెగ నామినేషన్ల సమయానికి తెలిసే అవకాశం ఉంటుంది. అప్పటికి అక్రమాల పేరుతో వారు.. ఎన్నికలను బహిష్కరించే ఆలోచన చేసే అవకాశం ఉంది. అయితేనే గ్రామాల్లో తమ పట్టు ఉందని .. ఎన్నికల్లో అక్రమాల వల్లే పోటీ చేయలేదనిచెప్పుకోవచ్చు. లేకపోతే ఫలితాలు గ్రామస్థాయిలో పార్టీ బలహీనపడిందన్న అభిప్రాయానికి వస్తారు. అలాంటి పరిస్థితిని బీఆర్ఎస్ కోరుకోకపోవచ్చు.