జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అకస్మాత్తుగా ఇప్ప సారా నినాదాన్ని అందుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సారా మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయని ప్రభుత్వాలు దానిపై నిషేధం విధిస్తుంటే, ఈ యువ ఎమ్మెల్యే మాత్రం అది ఒక సంజీవని అని, ప్రాచీన ఆరోగ్య రహస్యమని ప్రచారం చేస్తున్నారు. గతంలో సారా తాగిన వారు 115 ఏళ్ల వరకు ఆరోగ్యంగా బతికేవారని, ప్రస్తుత మద్యం వల్ల 60 ఏళ్లకే చనిపోతున్నారని ఆయన చేస్తున్న వాదనలు వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక బలమైన వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది.
ప్రభుత్వానికి లక్ష కోట్ల ఆదాయం వస్తుందట
ముఖ్యంగా ఇప్ప సారాను తెలంగాణ బ్రాండ్‌గా మార్చాలని, దీని ద్వారా రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆయన లెక్కలు చెబుతున్నారు. విదేశాల్లో టకీలా వంటి పానీయాలకు ఉన్న గ్లోబల్ ఇమేజ్ మన ఇప్ప సారాకు కూడా రావాలన్నది ఆయన ఆకాంక్ష. అయితే, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సారా దుకాణాలు తెరవాలని డిమాండ్ చేయడం వెనుక ప్రభుత్వ సంకేతాలు ఉన్నాయా లేదా ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమా అన్నది సస్పెన్స్‌గా మారింది. గతంలో కూడా ఆయన తన సొంత పార్టీ నేతలపై, ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉంది. ఈ ‘సారా’ నినాదం కూడా అలాంటి వ్యూహంలో భాగమా అన్న చర్చ నడుస్తోంది.
సారా మంచిదని చెప్పడం అంటే సాహసమే !
అనిరుధ్ రెడ్డి వాదనలో ప్రధానంగా ఆర్థిక, సామాజిక కోణాలు కనిపిస్తున్నాయి. అడవుల్లో దొరికే ఇప్పపువ్వు ద్వారా ఆదివాసీలు, గిరిజనులకు ఉపాధి దొరుకుతుందని, కల్తీ లేని సారా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయన చెబుతున్నారు. కానీ, ప్రాక్టికల్‌గా చూస్తే సారా వల్ల తలెత్తే కల్తీ సమస్యలను, శాంతిభద్రతల ఇబ్బందులను ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుందనేది ప్రశ్నార్థకం. మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వమే సారా దుకాణాలు నడుపుతున్న ఉదాహరణలను ఆయన తెరపైకి తెస్తున్నారు. ఈ విశ్లేషణను బట్టి చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే పక్కా ప్లాన్ తోనే ఉన్నారని అనుకోవచ్చు.
ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగమా ?
జడ్చర్ల నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకోవడానికి లేదా గిరిజన ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి అనిరుధ్ రెడ్డి ఈ ఎత్తుగడ వేశారా అనే చర్చ సాగుతోంది. ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్న తరుణంలో, సారాను ఒక ప్రత్యామ్నాయంగా చూపడం ద్వారా ఆయన ప్రజల్లోకి ఒక కొత్త చర్చను తీసుకెళ్లారు. అది ఎంతవరకు సఫలమవుతుందో, ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
