నోరు అదుపు చేసుకోలేని వారు సీఎంలు, డిప్యూటీ సీఎంలు అవుతారంటూ పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. దీనికి కారణం .. కోనసీమ పచ్చదనం, కొబ్బరి చెట్ల తలలు వాలిపోతూండటంపై పవన్ చేసిన వ్యాఖ్యలు. రాష్ట్ర విభజనకు కోనసీమ పచ్చదనం కూడా ఓ కారణం అని.. నరుడు దిష్టికి నల్ల రాయి కూడా బద్దలై పోతుంది, కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగిందని అన్నారు. ఈ మాటలు తెలంగాణను కించపరిచినట్లుగా ఉన్నాయని జగదీష్ రెడ్డి స్పందించారు.
ఇక్కడి నుంచి ఎవరైనా అక్కడికి వెళ్లి దిష్టిపెట్టారా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. అక్కడి నుంచే భారీ సంఖ్యలో హైదరాబాద్ కు వస్తున్నందున వారి దిష్టి మనపైనే పడుతుందన్నారు. అలాంటి వారు తమ నాలుకను అదుపులో ఉంచుకోవడం నేర్చుకోకుండానే డిప్యూటీ సీఎం అవుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఉద్దేశం తెలంగాణ ప్రజల్ని కించపర్చడం కాదని దిష్టి తగిలిందని చెప్పడం మాత్రమేనని జసేన వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయ నేతలు ఏం మాట్లాడినా ఒక్కో సారి వివాదాస్పదమవుతూ ఉంటాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ లాంటి సెలబ్రిటీ రాజకీయాల్లో ఉన్నప్పుడు .. ఆయన మాట్లాడే మాటలకు ఎన్నో అర్థాలు తీస్తూ ఉంటారు. అలాగే పవన్ కల్యాణ్ మాటలకు ఎప్పుడూ రకరకాల అర్థాలు తీస్తూనే ఉంటారు. ఈ సారి పవన్ కల్యాణ్ మరింత ఎక్కువగా తెలంగాణలో టార్గెట్ అవుతున్నారు.