ఏపీ ప్రభుత్వం ప్రజలందరికీ రూ. పాతిక లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కల్పించాలని నిర్ణయించుకుంది. యూనివర్శల్ హెల్త్ పాలసీని రూపొందిస్తోంది.అందరూ ఇది గొప్ప నిర్ణయం అని పొగుడుతూంటే.. జగన్ రెడ్డి మాత్రం.. లాభాలు రాకుండా ఆ కంపెనీలు పాలసీలు ఇస్తాయా అంటూ దీర్ఘాలు తీస్తూ చాట భారతం అంత స్క్రిప్ట్ రాయించి తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేయించారు. అసలు రూ. పాతిక లక్షల ఇన్సూరెన్స్ వద్దని ఆయన అంటున్నారు. ఆరోగ్యశ్రీనే బెటర్ గా తన హయాంలో ఇచ్చామని సాక్షి పత్రిక పేపర్ కటింగ్స్ సాక్ష్యంగా చూపించుకున్నారు. తాను ఏమీ చేయకపోయినా ఏదో చేసేశానని చెప్పుకునేందుకు జగన్ రెడ్డి అన్నింటికీ సాక్షి మీద ఆధారపడతారు. కానీ నిజాల మీద కాదు.
ఇదే ట్వీట్ లో మెడికల్ కాలేజీని అమ్మేస్తున్నారని.. మీ వాళ్లకు ఇచ్చేస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. కేబినెట్ లో పబ్లిక్,ప్రైవేటు, పార్టనర్ షిప్లో మెడికల్ కాలేజీల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు.అంటే అమ్మేయడం అని.. ఉదయం నుంచి వైసీపీ నేతలంతా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అదే పనిగా చెప్పుకొచ్చారు. జగన్ కూడా అదే చివరికి చెప్పారు. కానీ పీపీపీ అంటే ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని సంబంధిత మంత్రి సత్యకుమార్ సూచించారు. యాజమాన్యం ప్రభుత్వానిదేనని నిర్వహణలో మాత్రం ప్రైవేటు సహకారం ఉటుందని ఆయన స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల పేరుతో పెద్ద ఎత్తున అప్పులు చేసి కనీస భవనాలు కూడా పూర్తి చేయలేదు జగన్ హయాంలో.
అయితే అసలు ఇంత చాటభారతాలు రాయడం ఎందుకు..నేరుగా అసెంబ్లీకి వచ్చి వీటన్నింటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలిగా అన్న సందేహాలు సహజంగానే ఎవరికైనా వస్తాయి. బయట ఇవన్నీ మాట్లాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదనప్పుడు సభలో చెప్పడానికి ఎందుకు అవసరం అవుతుందన్నది ప్రశ్న. సభకు వచ్చాక చెప్పడానికి అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ప్రజలకు చెప్పుకోవచ్చు. కానీ జగన్ రెడ్డి మాత్రం అసెంబ్లీ వైపు చూడటానికే భయపడుతున్నారు. దూరంగా కూర్చుని తనకు తోచింది..తాను అనుకున్నదే నిజమని ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.