జగన్ `కక్షా’ బంద్

జగన్ కి ఓదార్పు యాత్రల గురించి తెలిసినంతగా రక్షాబంధన్ వంటి హిందూపండుగుల గురించి తెలిసినట్టులేదు. తెలిసిఉంటే పండుగరోజున ప్రత్యేక హోదాకోసం బంద్ కు పిలుపునిచ్చేవారుకారు. రాష్ట్ర బంద్ కు రక్షాబంధన్ నాడే ముహూర్తంపెట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రక్షాబంధన్ పండుగనాడు బంద్ చేయించి తాను మాత్రం రాజకీయ `రక్షరేకు’ కట్టుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారంటూ పలు వర్గాల నుంచి విమర్శలువెల్లువెత్తుతున్నాయి. కేవలం తమపార్టీమీద కక్షకట్టి జగన్ ఈ బంద్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్యేలంటున్నారు. అయితే ప్రజలుమాత్రం ఈరాజకీయ కక్షలతో తమకు సంబంధంలేదనీ, హాయిగా రాఖీపండుగ చేసుకోనివ్వకుండా ఏమిటీ బంద్ లంటూ మండిపడుతున్నారు. కాగా, మరోపక్క బంద్ రోజున ఆర్టీసీ బస్సుల విధ్వంసం తప్పదని వైఎస్సార్ సీపీ గౌరవ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ అనడం విజయవాడ పోలీసులనే నెవ్వరపరిచింది.

రక్షాబంధన్ పండుగను హిందువులు ఎంతో ఆత్మీయంగా జరుపుకుంటారు. సోదరీసోదరులు కలుసుకుని తమ అనుబంధాలను మరింత పటిష్టపరుచుకుంటారు. రక్తసంబంధీకులు ఎంత దూరంలో ఉన్నా రక్షాబంధన్ రోజున పలకరించుకోవడం సత్సంప్రదాయం. అయితే ఆంధ్రప్రదేశ్ లో రేపు (29-08-15) రక్షాబంధన్ రోజునే జగన్ బంద్ పాటించాలని పిలుపునివ్వడం ఇప్పుడు పండుగ ఉత్సాహంపై కడివెడు నీళ్లుకుమ్మరించినట్టయింది. తాము బంద్ కు పిలుపునిస్తే అది ఎంత ఘాటుగా ఉంటుందో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చెప్పకనే చెప్పారు. దీంతో రక్షాబంధన్ రోజున ఆర్టీసీ బస్సులు తిరగవేమోనన్న ఆందోళన అందరిలో తలెత్తింది. బస్సులు తిరగకపోతే తమ ఆత్మీయ సోదరీసోదరులను కలుసుకోవడం ఎలాఅని పలువురు ప్రశ్నిస్తున్నారు.

బంద్ శాంతియుతంగా జరుగుతుందా ? లేక హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటాయన్నది ప్రతి బంద్ కు ముందూ సామాన్యుడికి కలిగే కామన్ కొశ్చిన్. బంద్ హడావుడిగానే జరుగుతుందని తెలిసినప్పుడు ధైర్యంగా ఫ్యామిలీని తీసుకుని వీధుల్లోకి చాలామంది వెళ్లలేరు. పైగా దుకాణాలు మూసేసిఉండటంతో మధ్యలో ఏ చిన్నవస్తువు కావాలన్న దొరకని పరిస్థితి ఉంటుంది. ఏరకంగా చూసినా, పండగవేళల్లో బంద్ పాటించడం ఏమాత్రం మంచిదికాదన్నమాటే ఎక్కువగా వినబడుతోంది. పైగా రేపు ఆర్ఆర్ బీ పరీక్ష 40వేల మంది రాస్తున్నారు. అలాంటి వారికి కనీసం బస్సుసౌకర్యంలేకపోతే ఎలాగన్నది మరో విమర్శ.

తెలుగుదేశం పార్టీ మహిళానాయకురాలు కవిత ఈ బంద్ ను తప్పుబట్టారు. పండగ రోజున బంద్ నిర్వహిస్తే ప్రజలు నొచ్చుకుంటారన్న ఇంగితజ్ఞానంలేకపోతే ఎలా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. హిందూమతస్థులు ఆచరించే పండుగరోజుల్లో బంద్ చేపట్టడాన్ని బట్టి జగన్ భారతీయ హిందూ సంప్రదాయాలను దెబ్బతీయడానికి , విలువలను కాలరాయడానికీ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుందని కవిత ఆక్షేపించారు. హిందూ పండుగలపై కక్షకట్టి జగన్ ఇలా పండుగరోజునే బంద్ కు పిలుపునిచ్చారని ఆరోపిస్తున్నారు.

ప్రజాస్వామ్య దేశంలో బంద్ కు పిలుపునివ్వడం తప్పుకాకపోవచ్చు. కానీ ఏరోజున బంద్ కు పిలుపునిస్తున్నామో కాస్తంత తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం బంద్ చేయాలనుకోవడాన్ని తప్పుబట్టలేం. కాకపోతే పండుగరోజునే బంద్ చేయాలనడమేమిటన్నదే ప్రశ్న. దీనికి కచ్చితంగా జగన్ సమాధానం చెప్పాల్సిందే. పండుగవాతావరణం ఏమాత్రం లేకుండా నిర్మానుష్యంగా ఉన్న రోడ్లను రక్షాబంధన్ రోజున మనం చూడబోతున్నామా? అదే జరిగితే అది రక్షాబంధన్ కాదు, జగన్ `రక్షా’ బంద్ అవుతుంది. ఆయనకు రక్షగా ఉండేదుకు మాత్రమే ఈ బంద్ ఉపయోగపడుతుందేమోకానీ, ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తికి గురికావడం ఖాయం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com