వైసీపీలో ఇఫ్తార్ విందు రాజకీయం స్పైసీ బిర్యానీలో స్పైసీ ఎక్కువైపోయినట్లుగా మంటపుట్టిస్తోంది. గుంటూరులో ఇఫ్తార్ విందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. బుధవారం జరగాల్సి ఉంది. కానీ చివరి రోజున క్యాన్సిల్ చేశారు. తర్వాత వచ్చే వారం విజయవాడలో జరుగుతుందని మరో ప్రకటన ఇచ్చారు. ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత ఇలా చేయడం ఏమిటని ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు చిన్నబుచ్చుకున్నారు. కానీ వారు చేసిన తప్పు వల్లే జగన్ ఇఫ్తార్ విందును రద్దు చేసుకున్నారు. అదేమిటంటే.. క్రెడిట్ ను జగన్ కు ఇవ్వకుండా.. ఆ నేతలు కొట్టేయాలనుకున్నారు. డబ్బులు వాళ్లే పెడుతున్నారు కాబట్టి కొట్టేయడం అని వారు అనుకుని ఉండరు..కానీ జగన్ అనుకుంటారు.
గుంటూరులో ఇఫ్తార్ విందు కోసం రాజకీయ వ్యాపారంలో రాటుదేలిపోయిన ఓ మహిళ భారీగా ఖర్చు పెట్టుకున్నారు. బిర్యానీ ఖర్చు ఆమెదే. ఓ కాంట్రాక్టర్ కు ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్‌లో భాగంగా ఊరంతా ఫ్లెక్సీలు కూడా వేయించే కండిషన్ కూడా ఉంది. ఆయన ఫ్లెక్సీలు వేశాడు. దాంతో అది జగన్ రెడ్డి ఇస్తున్న ఇఫ్తార్ విందులా కాకుండా.. ఆ మహిళా నేత ఇస్తున్న విందులో బిర్యానీ తినడానికి జగన్ వస్తున్నారన్నట్లుగా ఉందని ఆమె ఇంచ్ ఇష్టం లేని ఇతర నేతలు సజ్జలకు ఫిర్యాదులు చేశారు. అది జగన్ దృష్టికి కూడా వెళ్లింది. ప్రచారం తనకు కాకుండా మొత్తం మహిళా నేతకు వెళ్తుందని ఆయన మొహమాటం లేకుండా ప్రోగ్రాంను క్యాన్సిల్ చేయించారు. తర్వాత విజయవాడకు వేదిక మార్చారు.
గుంటూరులో జరిగిన తప్పులు విజయవాడలో జరగకుండా ఎవరు ఖర్చు పెట్టుకున్నా.., ఓన్లీ జగన్ ఫోటోలు మాత్రం హైలెట్ అయ్యేలా ఫ్లెక్సీలు పెట్టాలని ఆదేశాలు వెళ్లాయి. దేవినేని అవినాష్ లాంటి వాళ్లు మరీ హడావుడి చేస్తారేమోనని ముందుగానే రూల్స్ పార్టీ నేతలకు పంపారు. వారి బాధలు వారు పడతారు. అయితే గుంటూరులో ఇఫ్తార్ విందు కోసం చేసిన ఏర్పాట్ల ఖర్చులు ఇప్పుడు ఆ పార్టీ నేతలకు సమస్యగా మారాయి. కానీ ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు.


