టీఆర్ఎస్ మద్దతు ఏ విధంగా లాభం..? జగన్ ట్రాప్‌లో పడుతున్నారా..?

“జగన్ ను ప్రత్యేకంగా ఎవరో ఓడించాల్సిన పని లేదు.. ఆయనను ఆయనే ఓడించుకుంటారు…” ఇది ఏపీ రాజకీయాల్లో చాలా కాలంగా .. ఉన్న సెటైర్. జగన్ రాజకీయ జీవితం ప్రారంభించిన తర్వాత.. ఇప్పటి వరకూ ఆయన వేసిన అడుగులతో వచ్చిన ఫలితాలను చూస్తే.. ఎవరికైనా ఇదే అభిప్రాయం కలగడం సహజం. ఇప్పుడు ఎన్నికలకు ముందు… అలాంటి నిర్ణయమే.. జగన్ తీసుకుంటున్నారా..? అవసరం లేకపోయినా… కేసీఆర్ ముందు వాలిపోతున్నారా..? టీఆర్ఎస్ మద్దతు కోసం అర్రులు చాస్తున్నారా…?

కేసీఆర్‌తో జగన్‌కు “తప్పని” సాన్నిహిత్యం ఓ ట్రాప్‌నా..?

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు.. చావో రేవో అన్నట్లు పోరాడారు. గెలిచే సీట్లే అంటూ.. చాలా పరిమితంగా తీసుకుని.. కాంగ్రెస్‌ను గెలిపించాలనే పట్టుదలను ప్రదర్శించారు. కానీ… విధి రాత బాగోలేదు. అక్కడ టీఆర్ఎస్ గెలిచింది. కానీ.. తనను ఓడించడానికి.. సర్వశక్తులు చంద్రబాబు ఒడ్డారన్న కోపంతో.. ఏపీలో.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. సహజగానే…. కేసీఆర్ నుంచి ఇలాంటి ప్రకటన వచ్చిన తర్వాత ఏపీలో కలకలం రేగింది. కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా ఏపీలో పరిస్థితి మారిపోతుందేమోననేది ఆ కలకలం. చంద్రబాబు.. తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు ఏపీ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే… ఆ రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబుకు.. గొప్పగా ఉంటుందన్న ప్రచారం జరిగింది. అంతిమంగా అది… చంద్రబాబుకే లాభిస్తుందని.. ప్రతి ఒక్క చోటా రాజకీయ నేత కూడా అంచనా. అందుకే కేసీఆర్ .. చంద్రబాబుపై విమర్శలు చేసిన ప్రతీ సారి.. టీడీపీ అంతకు మించి రియాక్ట్ అయింది. రాజకీయంగా వాడుకుంది.

టీఆర్ఎస్‌కు లాభమే కానీ వైసీపీ చావు దెబ్బ..!

చంద్రబాబుకు కేసీఆర్ ఇవ్వాలనుకున్న ఆ గిఫ్ట్ వీలైనంత వరకూలోపాయికారీగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ పై పడింది. కానీ లోపాయికారీగా ఉంచాల్సిన అవసరం టీఆర్ఎస్ కు లేదు. ఇంకా చెప్పాలంటే… టీఆర్ఎస్ కు చాలా అవసరం. తమ వెనుక వైసీపీ లాంటి పార్టీలు ఉన్నాయని చెప్పుకుంటేనే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు గౌరవం లభిస్తుంది. అందుకే వైసీపీ నేతలతో కేసీఆర్ బహిరంగ చర్చలు, సమావేశాలకు పార్టీ నేతల్ని పంపిస్తున్నారు. ఇదందా.. కేసీఆర్ కు మేలు చేస్తుంది. అందులో సందేహం లేదు. మరి జగన్ కు వైసీపీకి మేలు చేస్తుంది. మేలు చేసే అవకాశం లేదు. కానీ చెడు మాత్రం చేసే అవకాశం ఉంది. తన పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది. కానీ జగన్ ఈ విషయం లో వెనుకడుగు వేయలేకపోతున్నారు.

టీఆర్ఎస్‌తో వైసీపీ స్నేహాన్ని ప్రజలు హర్షించే చాన్స్ లేదు..!

ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తూంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి… కేసీఆర్ ట్రాప్ లో పడిపోయారు. ఈ ట్రాప్ వల్ల టీఆర్ఎస్ భారీగా లాభపడుతుంది. కానీ.. వైసీపీ అస్థిత్వానికే ముప్పు ఏర్పడుతుంది. ఇప్పటికే… తెలుగుదేశం పార్టీ.. వైసీపీని ఆంధ్రా టీఆర్ఎస్ అని ప్రచారం చేస్తోంది. దీన్ని గట్టిగా తిప్పికొట్టుకోవాల్సిన పరిస్థితిలో… టీఆర్ఎస్ తో అంటకాగుతూ.. వైసీపీ అధినేత జగన్.. మీడియా ముందు హడావుడి చేయబోతున్నారు. ఇప్పుడు రాజకీయాలన్నీ భావోద్వేగాల మీదనే నడుస్తున్నాయి. ఈ విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియక కాదు. తెలిసి కూడా ఆయన టీఆర్ఎస్ ట్రాప్ లో పడుతున్నారు..? జగన్ గెలిస్తే.. కేసీఆర్ ఏపీపై పెత్తనం చేస్తాడన్న ఒక్క భావన వస్తే.. ప్రజలు స్పందించే తీరు అనూహ్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ జగన్ ఓడిపోతే టీఆర్ఎస్ కు వచ్చే నష్టమేం లేదు. కానీ జగన్ ఓడిపోతే.. ఆయన రాజకీయ భవిష్యత్ కే కాదు.. వ్యక్తిగతంగా కూడా… ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ఓ రకంగా ఇది ఓ ట్రాప్. మరి జగన్ తెలుసుకుంటారా..?

— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com