అసెంబ్లీలో జగన్ : హామీల అమలుపై ధీమా.. అభివృద్ధి పయనంపై నమ్మకం..!

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, ప్రత్యేకహోదా కోరుతూ.. కేంద్రానికి పంపే తీర్మానంపై జరిగిన చర్చలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధికారికంగా… తన ఆలోచనలు వివరించారు. ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో రాజకీయంగా … తన దృష్టి అంతా నేరుగానే ఉంటుందని …చంద్రబాబు..తనదైన మార్క్ విమర్శలు చేసి నిరూపించారు. మొదట ప్రత్యేకహోదా తీర్మానంపై.. ఆ అంశంపై మాట్లాడిన..జగన్మోహన్ రెడ్డి… మాజీ సీఎం చంద్రబాబను కార్నర్ చేశారు. ఏపీకి హోదాపై యూపీఏ కేబినెట్‌ ఆమోదం తెలిపి… ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలు ఇచ్చిందని … ఆ తర్వాత జనవరి 2015 వరకు ప్లానింగ్‌ కమిషన్‌ ఉందని జగన్ గుర్తు చేశారు. ఆ సమయంలో హోదాను అమలు చేయాలని ప్లానింగ్‌ కమిషన్‌ను కోరితే సరిపోయేది కానీ… చంద్రబాబు కనీసం లేఖ కూడా రాయలేదన్నారు. ద్రబాబు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఇప్పటికే హోదా వచ్చేదన్నారు. దీనిపై.. చంద్రబాబు.. తన వెర్షన్ వినిపించుకోవాల్సి వచ్చింది. హోదాపై నేను రాజీపడలేదు… 29 సార్లు ఢిల్లీ వెళ్లానన్నారు. ప్రధానే అంగీకరించకపోతే.. ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుందని…చంద్రబాబు ప్రశ్నించారు. దీనికి కూడా జగన్ కౌంటర్ ఇచ్చారు. పోలవరం ముంపు మండలాలు ఇవ్వకపోతే .. ప్రమాణస్వీకారం చేయనని చెప్పిన చంద్రబాబు.. ప్రత్యేక హోదాపై ఎందుకు ఆ డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు.

టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపైనా జగన్ ఘాటుగా స్పందించారు. కుక్క తోక ఎప్పుడూ వంకరేనన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం నాశనమైపోయిందని మండిపడ్డారు. గత ఐదేళ్లలో లంచం లేకుండా ఏ పని జరగలేదని.. గ్రామస్థాయి నుంచి అసెంబ్లీ దాకా అన్ని వ్యవస్థలను చెడగొట్టారని విమర్శించారు. చెడిపోయిన వ్యవస్థలో మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని జగన్‌ ప్రకటించారు. వ్యవస్థను మార్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరానని ప్రజల ఆశీస్సులతో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లతో గెలిచామన్నారు. పారదర్శక పాలన అందించేందుకు ఇప్పటికే శ్రీకారం చుట్టామన్నారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ ద్వారా ప్రాజెక్టుల్లో అవినీతి లేకుండా చేసి.. జ్యుడిషియల్‌ కమిషన్‌ సూచనలు తూచా తప్పకుండా అమలుచేస్తామని ప్రకటించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతారని … వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 13 సీట్లు కూడా రావని జోస్యంచెప్పారు. ఇసుక, మట్టి, రేషన్‌, పెన్షన్‌, ఇళ్లు, కులం, బర్త్‌ సర్టిఫికెట్లు… చివరకు మరుగుదొడ్లలోనూ టీడీపీ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. అవినీతికి దూరంగా ఉంటామని కరాఖండిగా చెబుతున్నామన్నారు. నీతివంతమైన పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

దేశ చరిత్రలోనే సామాజికంగా అత్యుత్తమైన కేబినెట్‌ ఏర్పాటు చేశామని… కేబినెట్‌లో నా సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద పీట వేశామని జగన్ గుర్తు చేశారు. నామినేటెడ్‌ పోస్టుల్లోనూ బడుగులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. నవరత్నాలతో పేదవాళ్లు అభివృద్ధి చెందితే పూర్తి సంతృప్తి పొందుతానన్నారు. వందల పేజీలతో మేనిఫెస్టోను మేం ప్రకటించలేదని …కేవలం నాలుగే నాలుగు పేజీలతో మేనిఫెస్టో రూపొందించామని… మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తామని మరోసారి ప్రకటించారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం, అక్టోబర్‌ 15 నుంచి రైతులకు రూ.12,500 సాయం , పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించేందుకు.. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 రిగ్గులు, రైతులు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు , పంటల బీమా ప్రీమియాన్ని చెల్లించడం లాంటి హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. గత ప్రభుత్వం రైతులకు రూ.2వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ పెండింగ్‌ పెట్టిందని.. అధికారంలోకి రాగానే ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు విడుదల చేశామన్నారు. వచ్చే బడ్జెట్‌లో ప్రకృతి సహాయనిధికి రూ. 2వేల కోట్లు కేటాయిస్తామని.. అలాగే.. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చి.. ఇప్పటి పరిస్థితి, రెండేళ్ల తర్వాత పరిస్థితి ఫొటోలతో చూపిస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిష్‌ మీడియంగా తీర్చిదిద్ది.. అలాగే.. తెలుగును కంపల్సరీ చేస్తాం, రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ తెస్తామని ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల భారాన్ని తగ్గించి..ఫీజుల నియంత్రణ, క్వాలిటీ కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జనవరి 26న అమ్మఒడి పథకం ప్రారంభించి ..ప్రతి తల్లి చేతికి రూ.15 వేలు నగదు అందజేస్తామని జగన్ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామన్నారు.

ఎన్నికల హామీల విషయంలో.. తన నిబద్ధతను జగన్ చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు రూ.వెయ్యి ఉన్న పెన్షన్‌ను రూ.2,250కి పెంచామని చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది రూ.250 పెంచుకుంటూ వెళ్తామన్నారు. తెలంగాణ కంటే రూ.వెయ్యి ఎక్కువగా అంగన్‌వాడీల వేతనాలు పెంచామని ఆశా వర్కర్లకు రూ. 10 వేలకు వేతనాలు పెంచామన్నారు. పారిశుధ్య కార్మికుల జీతాన్ని రూ.18వేలకు పెంచామన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు కమిటీ వేశామని గుర్తు చేశారు. అలాగే కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మంత్రులతో కమిటీ ఏర్పాటు మండలానికో 108, 104 వాహనాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని.. కొత్తగా 650 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఉగాది రోజున మహిళల పేరుతో 25లక్షల ఇళ్లకు పట్టాలు ఇస్తామన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1,150 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయాలు ప్రారంభి … సెప్టెంబర్‌ 1 నుంచి రేషన్‌ సరుకులు డోర్‌ డెలివరీ చేస్తామన్నారు. గస్టు 15న 4లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకాలు పూర్తవుతాయని ప్రకటించారు. చంద్రబాబు పాలనలో 10 రంగాల్లో రాష్ట్రం నష్టపోయింది.. త్వరలో వివరాలు వెల్లడిస్తానని ప్రకటించారు. ప్రతిపక్షం సహకరించకపోయినా వెనక్కి తగ్గని అభివృద్ధి వైపు నా అడుగులు వేస్తూనే ఉంటానని ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com