వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఇప్పుడల్లా ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధంగా లేరు. మరో ఏడాదిన్న తర్వాత పాదయాత్ర చేస్తానని అప్పటి నుంచి ఏడాదిన్నర పాటు ప్రజల్లో ఉంటానని ఆయన చెబుతున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి క్యాంప్ కోసం వచ్చిన ఆయన ఈ సారి ఏలూరు జిల్లా కార్యకర్తలను పిలిచి తన ప్రసంగాన్ని వినిపించారు. ఎప్పట్లాగే ప్రభుత్వంపై వ్యతిరేకత.. తన పథకాల డప్పు కొట్టిన ఆయన.. అసలు పార్టీని పట్టించుకోవడం లేదని.. కార్యకర్తలను వదిలేశారని బయట జరుగుతున్న ప్రచారంపై మాత్రం క్లారిటీ ఇచ్చారు.
ఇక నుంచి ప్రతి వారం ఓ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతానని జగన్ చెప్పారు. ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. వారానికో నియోజవర్గం అంటే.. మూడు ఏళ్లు సరిపోవు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా అంటున్నారు. వారానికో నియోజకవర్గం లెక్క ఏమిటంటే.. తాడేపల్లికి వచ్చే రెండు, మూడు రోజుల్లో ఓ రోజు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నమాట. అది కూడా సరిపోకపోతే ఎప్పుడైనా ప్రెస్మీట్ పెడతారు.
పల్నాడు కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. ఒక్క సారి వచ్చి ధైర్యం చెప్పన్నా అని అడుగుతున్నారు. బెట్టింగుల్లో నష్టపోయిన క్యాడర్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటం అంటే.. ప్రెస్మీట్లు, ప్రసంగాలు అనుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో రావడం అంటే.. పాదయాత్ర చేస్తే చాలనుకుంటున్నారు. ఆయన తీరుతో వైసీపీ క్యాడర్ దిగాలుపడిపోతోంది. అయితే పాదయాత్ర చేస్తే చాలు అంతా సెట్ అయిపోతుందని జగన్ రెడ్డి రిలాక్స్ అవుతున్నారు.
