జగన్మోహన్ రెడ్డి తనపై అనర్హతా వేటు వేయకుండా ఉండేలా ఓ జాగ్రత్త తీసుకున్నారు.అదేమిటంటే ఆయన ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడంలేదు. అసెంబ్లీకి రావడం లేదు కాబట్టి ఆయన జీతం తీసుకోవడం లేదో లేకపోతే మరో కారణం ఉందేమో తెలియదు కానీ మిగతా పది మందికి మాత్రం ఇలాంటి జాగ్రత్తలు చెప్పలేదు. వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్ మినహా మిగిలిన పది మంది జీతాలు తీసుకుంటున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ విషయాన్ని ప్రకటించారు.
10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు.. జగన్ ఒక్కడు మాత్రమే జీతం తీసుకోవడం లేదన్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతం ఇవ్వకూడదని.. ఈ అంశంఅసెంబ్లీలో చర్చిస్తానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. జీతం.. ఇతర అలవెన్స్ ల కింద ఒక్కో ఎమ్మెల్యేలకు నెలకు ఐదు లక్షల వరకూ లభిస్తాయి. జగన్ వాటిని కాదనుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఐదు లక్షలు పోగొట్టుకోవడం ఎందుకని తీసుకుంటున్నారు. కానీ అసెంబ్లీకి రావడం లేదు.
జీతాలు తీసుకుని అసెంబ్లీకి రాని వారిపై చర్యలు తీసుకునే ఆలోచన అయ్యన్న పాత్రుడు చేస్తున్నారు. అరవై రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ కు హజరు కాకపోతే అనర్హతా వేటు పడుతుంది. వచ్చే సమావేశాల్లో ఇరవై రోజులు అసెంబ్లీ జరిగితే అరవై రోజుల కోటా పూర్తవుతుంది. అప్పుడు ప్రభుత్వం ఈ పది మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్నదానిపైనా చర్చలు ప్రారంభమవుతాయి.