తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తున్న మైండ్ గేమ్ చూస్తుంటే, పాత మిత్రులు శత్రువులుగా, బద్ధశత్రువులు రహస్య మిత్రులుగా మారుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా జలాల వివాదం కేంద్రంగా ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకరికొకరు రాజకీయంగా సహకరించుకుంటున్న తీరు ఈ సరికొత్త సమీకరణాలకు బలం చేకూరుస్తోంది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదని, దీని వెనుక కాంగ్రెస్ పెద్దలు , జగన్ మధ్య ఒక వ్యూహాత్మక ఒప్పందం ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.
సీమ లిఫ్ట్ జగన్ హయాంలోనే ఆగింది – రేవంత్‌కు తెలియదా?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన విజ్ఞప్తి మేరకు చంద్రబాబు నిలిపివేశారని రేవంత్ రెడ్డి ప్రకటించడం ద్వారా చంద్రబాబును ఇరుకున పెట్టారు. ఇది జగన్‌కు ఒక పెద్ద ఆయుధంగా మారింది. “చంద్రబాబు వల్లే రాయలసీమకు అన్యాయం జరుగుతోంది అని విమర్శించడానికి జగన్‌కు రేవంత్ ఒక వేదికను సిద్ధం చేశారు. కానీ అది జగన్ హయాంలోనే ఆగిపోయింది. దీనికి ప్రతిగా, జగన్ తన ప్రెస్ మీట్లో కేసీఆర్ హయాంలోనే పనులు వేగంగా జరిగాయి అని చెబుతూనే, కేసీఆర్ ఏపీకి నీళ్లు ఇచ్చే విషయంలో సహకరించారని పరోక్షంగా ఒప్పుకున్నారు. ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డికి అస్త్రంగా మారింది. కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను జగన్‌కు తాకట్టు పెట్టారు అని రేవంత్ విమర్శించడానికి జగన్ స్వయంగా సాక్ష్యాలు ఇచ్చినట్లయింది.
బీఆర్ఎస్ను దెబ్బతీయడమే కామన్ ఎజెండా?
తెలంగాణలో బీఆర్ఎస్ను రాజకీయంగా కనుమరుగు చేయడం రేవంత్ రెడ్డి లక్ష్యం కాగా, ఏపీలో చంద్రబాబును ఇరకాటంలో పెట్టడం జగన్ లక్ష్యం. ఈ ఇద్దరి ఉమ్మడి శత్రువుల ప్రయోజనాలను దెబ్బతీసే క్రమంలో రేవంత్-జగన్ మధ్య ఒక అప్రకటిత అవగాహన కుదిరినట్లు కనిపిస్తోంది. జగన్ తన వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ ఇమేజ్ను తెలంగాణ ప్రజల్లో దెబ్బతీస్తుంటే, రేవంత్ తన చర్యల ద్వారా ఏపీలో చంద్రబాబుపై రాయలసీమ వాసుల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గివ్ అండ్ టేక్ పాలసీ వెనుక ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
కాంగ్రెస్‌కు జగన్ చేరువవుతున్నారా?
ఇటీవలి కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జగన్ గొంతు పెంచడం, అదే సమయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రితో సింక్ అవ్వడం చూస్తుంటే ఆయన హస్తం వైపు చూస్తున్నారనే సంకేతాలు అందుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం తనను చుట్టుముడుతున్న వేళ, కేంద్రంలో బలమైన మద్దతు కోసం లేదా కనీసం రాజకీయ రక్షణ కోసం జగన్ కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టి అయినా రేవంత్‌కు మేలు చేసేలా ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు-రేవంత్, జగన్-కేసీఆర్ అనే సమీకరణాలు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రేవంత్ రెడ్డి తన రాజకీయ ఎదుగుదల కోసం తన పాత గురువు చంద్రబాబును వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అటు జగన్ కూడా తన పాత మిత్రుడు కేసీఆర్‌ను వదిలించుకుని కాంగ్రెస్‌తో దోస్తీ కడితేనే భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నట్లున్నారు. ఈ క్రమంలోనే ఒకరికొకరు రాజకీయంగా పాస్ లు ఇచ్చుకుంటూ ప్రత్యర్థులను గోల్ చేయాలని చూస్తున్నారు. ఇదే నిజం అయితే ముందు ముందు కొన్ని కీలక పరిణామాలు జరగవచ్చు.
