జగన్ మోహన్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన Hello India ట్వీట్ల పరంపర ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాస్యాస్పదంగా మారింది. జాతీయ స్థాయి నేతల దృష్టిని ఆకర్షించేందుకు ఆయన పడుతున్న తాపత్రయం కామెడీగా కనిపిస్తోంది. గత ఐదేళ్ల పాలనలో దేశం ఏమైపోయినా, పొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి అన్యాయం జరిగినా ఏనాడూ స్పందించని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఇప్పుడు అకస్మాత్తుగా ఇండియా గుర్తుకొస్తోంది. తన హయాంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించినప్పుడు లేని ప్రజాస్వామ్య విలువలు , ఇప్పుడు తన అక్రమాలపై ఉచ్చు బిగుస్తుంటే మాత్రం Wake-up call అంటూ ఇంగ్లిష్ ట్వీట్ల రూపంలో బయటకు వస్తున్నాయి. గీతం యూనివర్సిటీ భూముల రద్దు నుంచి శ్రీశైలం ఘటనల వరకు ప్రతిదానికీ ‘Hello India’ అంటూ ట్యాగ్ చేయడం చూస్తుంటే.. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జాతీయ స్థాయిలో ‘విక్టిమ్ కార్డ్’ ప్లే చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది.
హిందూత్వం జరిగిన జగన్ ఎంత మాట్లాడితే అంత నష్టం
శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్ జరిగిందంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేయడం అత్యంత విచిత్రమైన పరిణామం. ఆలయాల్లో ఏదో జరిగిపోతోందని ఆయన ట్వీట్లు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నెయ్యిని వాడి, కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్‌తో ఆడుకున్న చరిత్ర ఉన్న జగన్, ఇప్పుడు భక్తుల రక్షణ గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీని అదుపు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని కూడా తన రాజకయానికి వాడుకుంటున్నారు.
విశ్వసనీయత సున్న – నమ్మని ఇండియా
జగన్ రెడ్డి ట్వీట్లు ఎవరి కోసం? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఆయన మాటలను నమ్మడం మానేశారు. అందుకే ఢిల్లీకి వినిపించేలా ఇంగ్లిష్‌లో ట్వీట్లు పెడుతున్నారు. కానీ, దేశం దృష్టిని ఆకర్షించాలంటే ముందుగా నాయకుడికి విశ్వసనీయత ఉండాలి. గతంలో జగన్ చేసిన పాలన, సాగించిన అరాచకాలు జాతీయ మీడియాకు కూడా బాగా తెలుసు. అప్పట్లో ఏనాడూ ఎవరికీ హలో చెప్పని జగన్, ఇప్పుడు కేసులు చుట్టుముట్టేసరికి దేశం మొత్తాన్ని నిద్రలేపాలని చూడటం హాస్యాస్పదం. ఆయన వేస్తున్న ఈ వేక్-అప్ కాల్స్ కేవలం తనను తాను రక్షించుకోవడానికి చేస్తున్న అలారం శబ్దాలే తప్ప అందులో నిజం లేదని అందరికీ తెలుసు.
ఇండియా కూటమితో పొత్తు కోసమేనా?
జగన్ పదేపదే Hello India అనడం వెనుక మరో రాజకీయ వ్యూహం ఉందన్న అనుమానాలూ బలపడుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం నుంచి తనకు ఎదురుదెబ్బలు తగులుతున్న తరుణంలో, కాంగ్రెస్ నాయకత్వంలోని INDIA కూటమి వైపు వెళ్లేందుకు ఆయన సంకేతాలు ఇస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల సానుభూతిని పొంది, తనపై జరుగుతున్న అవినీతి విచారణల నుంచి తప్పించుకోవాలనేది ఆయన ప్లాన్‌గా కనిపిస్తోంది. రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోయిన తర్వాత ఎన్ని భాషల్లో ట్వీట్లు పెట్టినా ఫలితం ఉండదు. ఈ విషయం జగన్‌కు, వైసీపీ నేతలకూ తెలుసు. కానీ వారి తీరు ఎప్పటికీ మారదు.
