జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో రూ.800కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఈడీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. చార్జిషీట్లు దాఖలు అయి ట్రయల్స్ ప్రారంభం కాకుండా వ్యవస్థలతో ఆడుకుంటున్న నిందితులకు ఇది ఎలాంటి షాక్ ఇవ్వలేదు. ప్రజలకే అసలు షాక్ ఇస్తుంది. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది?. అడ్డంగా ప్రజల్ని దోచుకున్న విషయం కళ్ల ముందు ఉన్నా ఎందుకు వ్యవస్థలు శిక్షించలేకపోతున్నాయి ?. ఎప్పుడో ఓ సారి ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు?. ఇదే ప్రజలకు అర్థమయ్యి.. అర్థం కానట్లుగా ఉంటోంది.
జప్తు చేస్తున్న ఆస్తులు దొంగలవి కాదు !
జగన్ అక్రమాస్తుల కేసుల్లో గతం అయినా ప్రస్తుతం అయినా ఈడీ జప్తు చేసిన ఆస్తులు ఆయా నిందితులవి కావు. ప్రజా ఆస్తులు దోపిడీ చేసిన దొంగలవి కావు. ప్రజల ఆస్తులే. ప్రజా ఆస్తుల్ని సొంత ఆస్తుల్లా అమ్ముకుని.. తమ ఖాజానా నింపుకున్న వారి ఆస్తులుకావు. తాజాగా జప్తు చేసిన సున్నపురాయి గనులు కూడా ప్రభుత్వానివి. అంటే ప్రజలవే. మరి నిందితులకు ఎలా షాక్ తగులుతుంది ?.
ఇంకెన్నాళ్లు ఈ కేసులు సాగుతాయి?
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ సీఎం కాక ముందు అనామకుడు. సబ్ కాంట్రాక్టులు చేసుకునేవాడు. వైఎస్ సీఎం అయిన తర్వాత ఆయన కంపెనీలకు ప్రభుత్వ వనరులు కట్టబెడితే ఆయా కంపెనీలు జగన్ రెడ్డికి ముడుపులు చెల్లించుకున్నాయి. దానికి అదనంగా సొంతగా భూదందాలు. లక్ష కోట్లకుపైగా ఆస్తుల్ని జగన్ సంపాదించుకున్నారన్నది బహిరంగరహస్యం. అధికారికంగానే ఆయన లెక్కలేనంత సంపాదన కనిపిస్తోంది. ఓ సామాన్య ఉద్యోగి రెండు లక్షలు ఎక్కువగా ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగే వ్యవస్థలు జగన్ వేల కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో అడగరా?. ఇప్పటికే పదమూడు ఏళ్లు దాటిపోయింది. కనీసం ట్రయల్ ప్రారంభం కాలేదు. దీనికి సిగ్గుపడాల్సింది ఎవరు ?
ఇంకెన్నాళ్లు సాగదీస్తారు ?
క్రిమినల్ మైండ్ సెట్ అదీ కూడా లార్జ్ స్కేల్ దోపిడీ మైండ్ సెట్ ఉన్న వారు..క్రూర మనస్థత్వం ఉన్న వారిని అలా వదిలేస్తే.. చట్టాలు..ఎందుకు ఇక. వారి వల్ల సమాజానికి జరిగే నష్టాన్ని ఎవరు భర్తి చేస్తారు ?. అలాంటి దోపిడీ దారుడ్ని వదిలేయడం వల్లనే సీఎం అయ్యారు.. అత్యంత ఘోరంగా మళ్లీ దోపిడీ చేశారు. ఈ వైఫల్యం ఎవరిది?. ఏ వ్యవస్థ సిగ్గుపడాలి ?. ఇప్పటికైనా ఇలాంటి నేరాలు చేసేవారికి స్పష్టమైన సంకేతం పంపాలంటే.. ఖచ్చితంగా వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షించాల్సి ఉంది.