ఎన్నికలకు ముందు పర్మినెంట్ చేస్తారనో.. జీతం పదివేలు చేస్తారనో ఎదురు చూసిన వాలంటీర్లకు జగన్ రెడ్డి ఊహించని తాయిలం ప్రకటించారు. జీతం రూ. 750 పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఐదు వేలు ఇస్తున్నారు. రేపు జనవరి ఒకటో తేదీ నుంచి 5750 ఇస్తారన్నమాట. అంటే.. ఫిబ్రవరి ఒకటో తేదీన జీతం వస్తుంది. ఆ నెలలో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత జీతాలు వస్తాయో లేదో ఎవరికీ తెలియదు. వాలంటీర్లతో పార్టీ పనులు చేయించుకుంటూ ప్రజాధనం ఇస్తున్న జగన్ రెడ్డి.. ఆ వ్యవస్థపై ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గడం లేదు.
తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని తమ జీతాలు పెంచాలని మధ్యలో వారు ఓ సారి ఉద్యమం చేస్తే.. మీరు చేసేది ఉద్యోగం కాదు సేవ.. మీకు జీతాలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. కానీ ఉద్యోగాల ప్రస్తావన వచ్చిన ప్రతీ సారి.. రెండున్నర లక్షల వాలంటీర్ల ఉద్యోగాలిచ్చామని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. అప్పట్లో అవార్డులిస్తామని చెప్పి వారి ఆందోళనను ముగింప చేశారు.
కనీసం తమ పార్టీ కోసం పని చేస్తున్నారన్న సానుభూతితో అయినా.. ఎన్నికలకు ముందు తమకో వరం ప్రకటిస్తారనుకుంటే.. ఏడు వంద యాభై రూపాయలు పెంచి.. పండగ చేసుకోమన్నారు. అయినా ఈ 750 లెక్కేమిటో వాలంటీర్లకు అర్థం కావడం లేదు. ఐదు వందలు.. లేకపోతే వెయ్యి పెంచవచ్చుగా అని ఆలోచిస్తున్నారు.