ఏపీలో విజయా బ్రాండ్ అంటే ప్రభుత్వ సహకార రంగంలోని డెయిరీ. అయితే జగన్ హయాంలో ఈ బ్రాండ్ ను వాడుకునేందుకు ప్రైవేటు సంస్థలకు ఇచ్చేశారట. వారు కల్తీ నెయ్యి, పాలు విజయా బ్రాండ్ పేరుతో తెలంగాణలో అమ్ముతున్నారు. తెలంగాణలో విజయా డైరీపై ఈ కల్తీ మరక పడుతోంది. దీంతో తెలంగాణ విజయా డెయిరీ బాధ్యులు గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఈ విషయం మీడియాను పిలిచి అనని వివరాలు చెప్పారు.
ఏపీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ పరిధిలోని ప్రతిష్టాత్మక విజయ బ్రాండ్ వినియోగ హక్కులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు, ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన మేఘన ఫుడ్స్ వంటి సంస్థలకు కట్టబెట్టారు. దీని వల్ల విజయ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి కల్తీ ఉత్పత్తులు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్లో తయారవుతున్న నెయ్యిని ‘విజయ’ లేబుల్‌తో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో విక్రయిస్తున్నారని, అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ పరీక్షల్లో నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది.
పాల ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రభుత్వ డైరీ వివరాలకు బదులుగా ప్రైవేట్ కంపెనీల పేర్లు రావడం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు ఒప్పందాలకు నిదర్శనమని గుత్త ాఅమిత్ రెడ్డి చెబుతున్నారు. డైరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ బ్రాండ్‌ను ప్రైవేట్ వ్యక్తులు వాడుకోవడానికి వీల్లేకపోయినా, గత పాలకులు ఆ నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, కల్తీకి కారణమైన ప్రైవేట్ ఫ్రాంచైజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని గుత్తా అమిత్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
