సుదీర్ఘ విదేశీ విహారయాత్ర ముగించుకుని ఎట్టకేలకు జగన్ రెడ్డి తిరిగి వచ్చారు. అయితే వచ్చింది ఏపీకి కాదు. బెంగళూరుకు. తాను వచ్చానని అందరికీ తెలియాలి, పైగా తన చెవులకు సీఎం సీఎం అనే నినాదాలు సోకాలి. అందుకే పార్టీ నేతల ఇళ్లల్లో శుభకార్యాలు ఎక్కడున్నాయో తెలుసుకుని.. బెంగళూరుకు చేరువలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఒక పార్టీ నేత ఇంట్లో జరుగుతున్న రిసెప్షన్ వేడుకను తన రాజకీయ ప్రతాపానికి వేదికగా మార్చుకుంటున్నారు. బెంగళూరుకు దగ్గరగా.. గంటలో వెళ్లి వచ్చే ప్రాంతానికి వచ్చి.. ఏపీకి వచ్చి పోయారని ప్రచారం చేసుకోనున్నారు.
జగన్ రాజకీయం ఇప్పుడు పూర్తిగా డిజిటల్ మయమైపోయింది. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టసుఖాలు పట్టించుకోవడం మానేసి, తాడేపల్లి ప్యాలెస్ లేదా బెంగళూరు ఎస్టేట్ నుంచి ట్వీట్లు వేయడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలకు ఎంత దూరం జరిగితే అంత మంచిదన్నట్లుగా ఆయన తీరు ఉంటే, ప్రజలు కూడా ఆయన పంథా ఆయనది.. మన దారి మనది అన్నట్లుగా మెల్లగా ఆయన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. జనాల్లో లేని నాయకుడిని, కేవలం డిజిటల్ స్క్రీన్ల మీద చూసి మురిసిపోయే కాలం చెల్లిపోయిందని కేడర్ కూడా లోలోపల గొణుక్కుంటోంది.
ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు సాక్షి టీవీలో వచ్చే విజువల్స్ చూస్తే జాలి వేయకమానదు. ఎక్కడో ఒకచోట కొంతమంది పెయిడ్ వర్కర్ల ను పోగేసి, వారితో గొంతు చించుకుని నినాదాలు చేయించి.. అదేదో రాష్ట్రవ్యాప్త ప్రభంజనంలా కలరింగ్ ఇచ్చుకోవడంలో ఆయన సంతృప్తి వెతుక్కుంటున్నారు. గ్రౌండ్ రియాలిటీకి, సాక్షిలో వచ్చే గ్రాఫిక్స్‌కు అసలు పొంతనే ఉండటం లేదు. పక్కాగా స్క్రిప్ట్ ప్రకారం సాగే ఈ షో లను చూసి జనం నవ్వుకుంటున్నా, జగన్ రెడ్డి మాత్రం తన చుట్టూ ఉన్న భజన బృందం ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌తో పరవశించిపోతున్నారు.
151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా, పంథా మార్చుకోకుండా ఇంకా అదే పాత పద్ధతుల్లో రాజకీయం చేయడం ఆయనకే చెల్లింది. విహారయాత్రల తర్వాత విశ్రాంతి, ఆపై విదేశీ యాత్రలు.. మధ్యలో ఇలాంటి తూతూమంత్రపు పర్యటనలు. ప్రజల మధ్య ఉండటం కంటే, తనను తాను ఒక సెలబ్రిటీగా ఫీల్ అవుతూ రిసెప్షన్లలో మెరవడమే రాజకీయం అనుకుంటే.. కష్టమేనని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పక్కోడి ఇంట్లో పండక్కి సీఎం నినాదాలు చేయించుకుంటే వచ్చే తృప్తి కంటే, సొంత రాష్ట్రంలో ప్రజల నమ్మకాన్ని గెలవడం ముఖ్యం అన్న కనీస సూత్రాన్ని ఆయన ఎప్పుడు గుర్తిస్తారో చూడాలి!
