అస్సాం రాజకీయాల్లో హిమంత బిశ్వ శర్మ ఒక అజేయ శక్తిగా ఆవిర్భవించారు. వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ, ఈశాన్య భారతంలో బీజేపీ పాగా వేయడంలో ఆయన పోషించిన పాత్ర అసాధారణం. ఒకప్పుడు కాంగ్రెస్ వ్యూహకర్తగా ఉండి, నేడు అదే పార్టీని ఈశాన్య రాష్ట్రాల నుంచి తుడిచిపెట్టే స్థాయికి ఆయన ఎదగడం వెనుక ఒక ఆసక్తికరమైన రాజకీయ ప్రయాణం ఉంది.
అహంకారానికి.. ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం
హిమంత బిశ్వ శర్మ ఎదుగుదల .. రాహుల్ గాంధీ వైఫల్యానికి ఒక సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పార్టీ సమస్యల గురించి చర్చించడానికి హిమంత వెళ్తే, రాహుల్ గాంధీ ఆయనకు కనీసం ప్రాధాన్యత ఇవ్వకుండా తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కాలక్షేపం చేశారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తుంది. ఆ అవమానమే హిమంతను బీజేపీ వైపు నడిపించింది. రాహుల్ గాంధీ ప్రదర్శించిన అహంకారం చివరకు కాంగ్రెస్‌ను ఈశాన్య రాష్ట్రాల్లో నామరూపాలు లేకుండా చేసేలా హిమంతలో కసిని పెంచింది.
కాంగ్రెస్ నుంచి బీజేపీకి.. అధికారం నుంచి విజయపథం వరకు!
2015లో బీజేపీలో చేరిన హిమంత, కేవలం అస్సాంకే పరిమితం కాకుండా నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ కన్వీనర్‌గా మొత్తం ఏడు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగిరేలా చేశారు. కాంగ్రెస్ బలాలు, బలహీనతలు క్షుణ్ణంగా తెలిసిన ఆయన, ఆ పార్టీ వ్యూహాలనే తిప్పికొట్టి ఈశాన్య రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ను తరిమేశారు. వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారంటే, అది ఆయన క్షేత్రస్థాయి రాజకీయ పరిజ్ఞానానికి మరియు ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనం.
అసాధ్యుడైన నేత.. అజేయమైన వ్యూహకర్త
హిమంత బిశ్వ శర్మ కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ కూడా. అస్సాంలో చొరబాట్ల నియంత్రణ, మౌలిక సదుపాయాల కల్పన , హిందూత్వ ఎజెండాను అభివృద్ధికి జోడించి ఆయన అమలు చేస్తున్న తీరు బీజేపీ అధిష్టానాన్ని మెప్పించింది. అందుకే కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడైనప్పటికీ, వరుసగా మూడు సార్లు ఆయనపైనే నమ్మకం ఉంచి సీఎం పీఠం అప్పగించడం బీజేపీ చరిత్రలో ఒక అరుదైన విషయం. ప్రత్యర్థులకు అందనంత వేగంతో నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత.
