నేనే సిఎం డైలాగ్‌కంటే మోడీ మీటింగే బాగా పనిచేస్తుందా?

ప్రతిపక్ష పార్టీ అనేదే ఉండకూడదు…..జీవితాంతంతం…ఇంకా చెప్పాలంటే తరతరాల వరకూ కూడా మేమే అధికారంలో ఉండాలి అనేది ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల ప్రధాన అజెండా అయిపోయింది. సొంత పార్టీలోనే మరో నేతను ఎదగనివ్వని నాయకులు ప్రత్యర్థి పార్టీలను బ్రతకనిస్తారా? పోలీసులతో ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని, భజన మీడియా సాయంతో ప్రతిపక్ష పార్టీలు. నాయకులను ఎన్ని రకాలు ఇబ్బందులు పెట్టాలో అన్నీ చేస్తున్నారు. ఎప్పుడో నెలల క్రితం సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేస్తే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి జైల్లో పెట్టించడమంటే మనవాళ్ళ పనితీరు ఏంటో అర్థం కావడం లేదా? లోకేష్‌పైన విమర్శలు చేసినందుకే అని చెప్తే జనాలు నవ్వుతారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ కేసును అడ్డుపెట్టుకున్నారన్నమాట. వ్యవస్థలను ఎంతలా నాశనం చేస్తున్నారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. భూమా నాగిరెడ్డి పార్టీ మారడానికి కూడా ఇలాంటి కేసులు కూడా ఒక కారణమయ్యాయి. ఆ విషయాన్ని భూమానే స్వయంగా చెప్పాడు. ఎన్ని తప్పులు చేసినా దేశంలోనే ఏ నేతకూ లేనంత బలమైన భజన మీడియా ఉండగా జనాల అభిప్రాయాలను ప్రభావితం చేయడం పెద్ద విషయం కాదు అన్నది పాలకుల గట్టి నమ్మకం. అందుకే ఎలాంటి చర్యలకైనా తెగబడుతున్నారు.

ప్రభుత్వాల దమన కాండ నేపథ్యంలో అధికారంలో లేని నాయకులకు పార్టీని బ్రతికించుకోవడం అంటే మాటలు కాదు. అందుకే వైఎస్ జగన్ తెలివిగా ‘నేనే సిఎం’, మూడేళ్ళలో మనదే అధికారం, రెండేళ్ళలో మన ప్రభుత్వం వస్తుంది అంటూ ఓటర్లును, నాయకులను కాపాడుకోవడానికి….పూర్తిగా చంద్రబాబు చెప్పినట్టుగా చేస్తూ, తనను, తన పార్టీ నాయకులను ఇబ్బందులు పెడుతున్న అధికారులను హెచ్చరించడానికి ఎన్నో మాటలు చెప్పాడు. కానీ ఆ మాటలన్నీ కూడా కామెడీ అయిపోయాయి. విమర్శలు కూడా గట్టిగా వచ్చాయి. కానీ ఆ మాటల వళ్ళ సాధ్యం కానిది మోడీ మీటింగ్‌తో సాధ్యమవుతుందని టిడిపి నేతలు నమ్ముతున్నారు. జగన్ త్వరలో జైలుకు పోతాడు, 2019లో కూడా మా ప్రభుత్వమే వస్తుంది అని చెప్తూ అందరినీ మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు. ఇప్పుడు మోడీ మీటింగ్ పుణ్యమాని జగన్ జైలుకు పోతాడు అని చెప్పే డైలాగ్‌కి విశ్వసనీయత తగ్గిపోతుంది. ప్రధానమంత్రి అండ ఉండగా అలాంటి విపత్కర పరిస్థితి వచ్చే అవకాశం తక్కువ. మన దగ్గర వ్యవస్థలు అలానే పనిచేస్తాయి మరి. రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలు కూడా రెచ్చిపోయి మరీ జగన్‌ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి, వెంకయ్యనాయుడు మౌనవ్రతం పాటిస్తున్నాడు కాబట్టి ప్రస్తుతానికి అయితే జగన్‌కి మోడీ సపోర్ట్ ఉన్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు టిడిపి భయం కూడా అదే. జగన్‌కి మోడీ సపోర్ట్ ఉంది అని రాజకీయ నాయకులకు అర్థమైతే వైకాపాలోకి జంప్ చేసే జంపర్స్ సంఖ్య పెరుగుతుంది. అలాగే అత్యున్నత స్థాయి అధికారులు జగన్‌తో పెట్టుకోవడానికి మరీ ఉత్సాహం చూపించరు. అలాగే జగన్ కేసుల్లో సాక్షులుగా ఉన్నవాళ్ళ వాయిస్‌లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసు వీగిపోవడం, జగన్‌పై ఉన్న కేసుల్లో జగన్ జైలుకు పోవడం లాంటి రెండు ప్రధాన లక్ష్యాలతోనే ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, రైల్వే జోన్‌లాంటి రాష్ట్ర ప్రాధాన్యతలను ఫణంగా పెట్టి మరీ మోడీ దగ్గర సాగిలపడుతున్నాడు చంద్రబాబు. ఇప్పుడు జగన్ జైలుకు పోవడం అనే లక్ష్యం నెరవేరడం అనుమానంగా కనిపిస్తోంది. ఢిల్లీలో ఆరుగంటల పాటు ఎవరికీ కనిపించకుండా ఏదో చేశాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తిరిగి జగన్‌ని దెబ్బకొట్టాలంటే, జగన్ అత్యుత్సాహాన్ని తగ్గించాలంటే చంద్రబాబు చాలానే చేయాల్సి ఉంటుంది మరి. మొత్తానికి ఒక్క మీటింగ్‌తోనే ప్రత్యేక హోదా పోరాటానికి తిలోదకాలిచ్చి సీమాంధ్రులకు అన్యాయం చేసిన జగన్……రాజకీయంగా మాత్రం చాలానే సాధించేసినట్టుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]