వైఎస్ జగన్ గత పది రోజుల నుంచి తాడేపల్లికి రాలేదు. బెంగళూరుకే పరిమితమయ్యారు. వారానికి రెండు, ముడు రోజులు మాత్రమే ఆయన తాడేపల్లికి వస్తున్నారు. ఈ సారి అది కూడా లేదు. డిజిటల్ బుక్ ప్రారంభించడానికి రెండురోజులు వచ్చి వెళ్లారు. మళ్లీ రాలేదు. ఈ నెలలో యూరప్ టూర్ కు వెళ్లపోతున్నారు. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారు. పదిహేను రోజుల పాటు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి అన్ని రోజుల పాటు విదేశాల్లో పర్యటిస్తారు. నేరుగా బెంగళూరు నుంచి వెళ్లి.. బెంగళూరులోనే ల్యాండ్ అవుతారు. ప్రయాణానికి ముందు పాస్ పోర్టు తీసుకోవాల్సిన అవసరం ఉంటే విజయవాడ వస్తారు. లాయర్ తీసుకోవచ్చనుకుంటే ఆయన కూడా వచ్చే అవకాశం లేదు.
పార్టీ నేతల ముఖాన డిజిటల్ బుక్ అని ఒకటి కొట్టేశారు. మిమ్మిల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే అందులో రాసుకోమని సలహా ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కష్టపెట్టిన వారి అంతు చూద్దామని చెప్పుకొచ్చారు. మరి ఇప్పటి సంగతేమిటన్నా.. బూతులు తిట్టినందుకు, మార్ఫింగులు చేసినందుకు అరెస్టులు చేస్తున్నారని గగ్గోలు పెడుతూంటే.. స్పందన లేదు. న్యాయ సాయం లేదు.. ఆర్థిక సాయం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం.. బలైపోయిన వాళ్లు పోని.. కొత్త వాళ్లను నియమించుకోవాలని ఇంచార్జులపై ఒత్తిడి చేస్తున్నారు.
ఓడిపోయిన తర్వాత జగన్ అత్యధిక సమయం బెంగళూరులోనే ఉంటున్నారు . అక్కడ్నుంచి ఏమైనా రహస్య పర్యటనలు చేస్తున్నారో లేదో స్పష్టత లేదు. కానీ మొదట్లో వారానికి నాలుగు రోజులు తాడేపల్లిలో ఉండేవారు. రాను రాను అది రెండు రోజులకు పడిపోయింది. ఇప్పుడు అవసరం ఉంటే.. ప్రజలు మర్చిపోతారనుంటే వచ్చి ప్రెస్మీట్ పెట్టి.. చంద్రబాబును తిట్టడం, పార్టీ నేతల సమావేశం పేరుతో వీడియో విడుదల చేయడం మాత్రమే చేస్తున్నారు. పాదయాత్ర ప్రారభించేవరకూ ఆయన షెడ్యూల్ ఇలాగే ఉంటుందని వైసీపీ వర్గాలు నిర్ణయానికి వచ్చేశాయి.