జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ప్రత్యర్థులను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని తీసుకున్న నిర్ణయాలు, కాలక్రమేణా అవే ప్రత్యర్థులకు చట్టబద్ధమైన బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజా సాక్ష్యం ఆంధ్రజ్యోతినే. ఆంధ్రజ్యోతి పత్రికకు విశాఖలో భూమి కేటాయింపుపై వైసీపీ చేస్తున్న రచ్చ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఆ సంస్థ2017లో మార్కెట్ ధర చెల్లించి కొనుగోలు చేసిన భూమిని, 2020లో జగన్ సర్కార్ కక్షపూరితంగా రద్దు చేసింది. అయితే, ఈ రద్దును హైకోర్టు తప్పుబడుతూ 2024 నవంబర్ 29న తీర్పు ఇవ్వడంతో, ఇప్పుడు ఆ సంస్థకు చట్టబద్ధంగా మరింత మేలు జరిగింది.
ఇది కొత్తగా ఇచ్చిన భూమి కాదు, కేవలం సర్దుబాటు మాత్రమే. ఆమోద పబ్లికేషన్స్ కొనుగోలు చేసిన 1.50 ఎకరాల్లో సగానికి పైగా నేషనల్ హైవే బఫర్ జోన్లోకి వెళ్లిపోవడంతో అది నిరుపయోగంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆ నిరుపయోగమైన భూమికి బదులుగా, అంతే విస్తీర్ణంలో వేరే భూమిని సర్దుబాటు చేస్తూ జీత్ జారీ చేసింది. జగన్ హయాంలో ఆ భూమిని లాక్కోవాలని చూడకపోయి ఉంటే, అది సాధారణ భూసేకరణ వివాదంగానే మిగిలిపోయేది. కానీ ఆయన కక్ష సాధింపు చర్య వల్ల ఇప్పుడు కోర్టు జోక్యంతో ఆంధ్రజ్యోతికి వివాదం లేని భూమి దక్కినట్లయింది.
నిబంధనల ప్రకారం సమాన మార్కెట్ విలువ కలిగిన భూమిని మాత్రమే మార్పిడి చేశారు. పైగా, ఈ భూమిని అమ్ముకోవడానికి, లీజుకు ఇవ్వడానికి వీల్లేదని, మూడేళ్లలో భవన నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. జగన్ సర్కార్ గతంలో చేసిన తప్పులకు కోర్టు మొట్టికాయలు వేసి సరిదిద్దుతుంటే, దానిని భూముల దోపిడీ గా చిత్రీకరించే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. కానీ ఈ ప్రచారం ఎలా ఉన్నా కానీ ఆంధ్రజ్యోతికి మాత్రం భవిష్యత్ లో కూడా సమస్యలు రాకుండా చేసి పెట్టేసింది.
ఆంధ్రజ్యోతి స్థలాన్ని వివాదంలోకి నెట్టడం ద్వారా దానికి చట్టపరంగా పూర్తిస్థాయి పరిష్కారం లభించేలా జగన్ పరోక్షంగా సాయపడ్డారు. రాజకీయాల్లో శత్రువులను దెబ్బతీయాలని చూసే క్రమంలో, సరైన ఆధారాలు లేకుండా తీసుకునే నిర్ణయాలు చివరికి వారికే ఎలా వరంగా మారుతాయో అనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. తన కక్షసాధింపు చర్యలతో తన పార్టీని టీమ్ 11 స్థాయికి పడిపోయేలా చేసుకున్న జగన్ ఇప్పటికీ తన తప్పేమిటో గుర్తించలేకపోతున్నారు.