తల్లి, చెల్లిపై ఆస్తి పోరాటంలో జగన్ రెడ్డి విజయం సాధించారు. సరస్వతి పవర్ కంపెనీలో తల్లి విజయలక్ష్మికి ఇచ్చిన షేర్లన్నింటినీ గిఫ్ట్ గా ఇచ్చానని .. వారిపై తనకు ఇప్పుడు ప్రేమ లేదని.. గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటానని ఎన్సీఎల్టీలో జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఆయనకే అనుకూలమైన తీర్పు వచ్చింది. విజయలక్ష్మి, షర్మిల వాదనలను ఎన్సీఎల్టీ పట్టిచుకోలేదు. జగన్ వాదనలతో ఏకీభవించి విజయలక్ష్మి, షర్మిలలకు వాటాల బదిలీ నిలుపుదల చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.
2019లో, జగన్ మోహన్ రెడ్డి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, తన సోదరి శర్మిలతో కలిసి ఆస్తుల విభజనకు సంబంధించి ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకం చేశారు. ఈ MoU ప్రకారం, జగన్కు 60 శాతం, షర్మిలకు 40 శాతం ఆస్తులు వెళ్లాలని నిర్ణయించారు. MoUలో సరస్వతి పవర్ షేర్లు, ఎలహంక ఇల్లు, భారతి సిమెంట్స్, సాక్షి మీడియాలో వాటాలు షర్మిలకు బదిలీ చేయడానికి అంగీకరించారు. 2021లో జగన్, భారతి తమ షేర్లను విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేశారు. ఆస్తులు అటాచ్ లో ఉండటంతో బదిలీ చేస్తే న్యాయపరమైన సమస్యలు పరిష్కారమయ్యాక లీగల్ గా పంచుకుందామని చెప్పారు.
జగన్ ఓడిపోయాక జగన్ తన స్వంతంగా సంపాదించిన ఆస్తులని.. షర్మిలకు ప్రేమ , ఆప్యాయతతో షేర్ ఇవ్వాలని 2019లో నిర్ణయించారని, కానీ షర్మిల రాజకీయంగా తనకు వ్యతిరేకంగా వెళ్లడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నానని ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ సంస్థ విలువ పెరగడంలో తన భార్య భారతితో కలిసి తాను కీలక పాత్ర పోషించానని, అందువల్ల ఈ షేర్లను షర్మిలకు ఇవ్వలేనని జగన్ వాదించారు. తల్లి విజయమ్మ షర్మిలకు షేర్లు బదిలీ చేశారని ..నిలిపివేయాలని పిటిషన్ వేశారు. విచారణ జరిగిన ఎన్సీఎల్టీ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది తల్లి, చెల్లిపై జగన్ సాధించిన విజయం అనుకోవచ్చు.