పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించి 15 రోజులు అయింది. నోట్లను మార్చుకునేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిపై అన్ని పార్టీల నాయకులూ స్పందిస్తూ వచ్చారు. కానీ, విపక్ష నేత జగన్ మాత్రం ఇంతవరకూ నోట్ల రద్దుపై స్పందించింది లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ సహజంగానే విమర్శలు పెంచింది! జగన్‌ను ఈడీ అంటే భయం, ఇప్పుడు మోడీ పేరు విన్నా భయపడుతున్నారంటూ చలోక్తులు విసిరారు. ఏదైతేనేం… ఎట్టకేలకు జగన్ నోట్ల రద్దుపై స్పందించారు.
నల్లధనంపై పోరాటం చేయడం మంచిదే అంటూ కేంద్ర నిర్ణయాన్ని అభినందించారు. అయితే, ఇలాంటి పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకునే ముందుగా విపక్షాలతోనూ సామాన్యులతోనూ చర్చించి అభిప్రాయం తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. కానీ, కేంద్రం ఎవ్వరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకుందని అన్నారు. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఇంత భారీ నిర్ణయం తీసుకుని ప్రజలను కష్టాలపాలు చేశారన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నా ఇబ్బంది ఉండదని జగన్ సూచించారు. కొన్నాళ్ల తరువాత అమలు చేసుకున్నా కేంద్రం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏప్రిల్ నెలకో, మరో తేదీ నిర్ణయించుకుని అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలూ చేపట్టాక నోట్లను రద్దు చేయాలని సూచించారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ విషయం ముందే తెలుసుననీ, అందుకే అన్నీ చక్కబెట్టుకున్నారంటూ రొటీన్‌గానే విమర్శలు గుప్పించారు.
నిజానికి, జగన్ అభిప్రాయపడ్డట్టు కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు విపక్షాలూ ప్రజల సంప్రదింపులతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తే బాగానే ఉంటుంది. కానీ, పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ముందుగా చర్చకు పెట్టి, అభిప్రాయ సేకరణ చేశాక అమలు చేస్తే ఏం ప్రయోజనం..? ఆ విషయం ముందే తెలిసిన చంద్రబాబు నాయుడే తన కుటుంబ సంస్థల్ని అమ్ముకున్నారని జగన్ స్వయంగా ఆరోపిస్తున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయాలా వద్దా అనే చర్చను కేంద్రం మొదలుపెడితే… నల్లధనవంతులు పెట్టేబేడా సర్దేసుకుంటారు కదా! దానిపై అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకునేలోపు బ్లాక్‌మనీ దారులు మళ్లిపోతుంది కదా! జరగాల్సిందంతా జరిగిపోయాక నిర్ణయం తీసుకుంటే ఒరిగేదీ ఉండదు.
ఇంకోటీ… ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని జగన్ అభిప్రాయపడ్డారు. నిజానికి, అది సాధ్యమా..? ఓపక్క పాత నోట్ల స్థానే కొత్తవి ముద్రించేశారు. బ్యాంకులకు పంపేశారు. మార్పిడి ప్రక్రియలో లోపాలు వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. ప్రజల ఇబ్బందుల్ని తొలగించాలంటే ఏటీఎమ్‌లలో బ్యాంకుల్లో నగదు నిల్వలు సరిపడా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంతేగానీ, ఈ తరుణంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆచరణ సాధ్యం అవుతుందా..? పైగా, ఇప్పటికే భాజపా విమర్శలు చాలా ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఒక్క అడుగు వెనక్కిపడ్డా భాజపాకి ప్రాణసంకటమే. మోడీ ప్రతిష్ట ఏమౌతుంది…? పదిహేను రోజుల తరువాత జగన్ స్పందించారుగానీ, ఇలా చర్చకు తావిచ్చేలా అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లో స్పష్టత కొరవడిందని చెప్పుకోవాలి.