రాజకీయ నాయకుల ఇమేజ్ బిల్డింగ్ కోసం సామాన్య ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే సంస్కృతి పెచ్చుమీరిపోతోంది. తమిళనాడులో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై అక్కడి న్యాయస్థానాలు, వ్యవస్థలు తక్షణమే స్పందించి ర్యాలీలపై కఠిన ఆంక్షలు విధించాయి. కానీ, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న ఊరేగింపుల్లో వరుసగా మరణాలు సంభవిస్తున్నా, ఇక్కడి వ్యవస్థలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.
జగన్కు తాను బయటకొస్తే తొక్కేసుకుంటారని చూపించుకోవాలనే మానసిక సమస్య
తమకు విపరీతమైన క్రేజ్ ఉందని, జనం తమ కోసం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారని ప్రపంచానికి చాటిచెప్పేందుకు రాజకీయ నేతలు ఆడుతున్న స్టేజ్డ్ డ్రామాలు చివరకు మరణ మృదంగంగా మారుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో జగన్ నిర్వహించిన తాజా ర్యాలీలో ఇద్దరు సొంత పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. గతంలో ఒక దళితుడిని తన కారు కిందనే తొక్కి చంపేసినా ఏమీ తెలియనట్లుగా నాటకమాడారు జగన్. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తుండటం గమనార్హం. ర్యాలీల పేరుతో జనాలను రోడ్లపైకి రప్పించి, వారి రక్షణను గాలికి వదిలేయడం ముమ్మాటికీ ఉద్దేశపూర్వక హత్యాకాండనే అవుతుంది.
వైసీపీ కార్యకర్తలవి ప్రాణాలు కావా.. వారికి కుటుంబాలు లేవా?
తమిళనాడులో విజయ్ విషయంలో అమలైన న్యాయం, ఏపీలో జగన్ విషయంలో ఎందుకు అమలు కావడం లేదు అన్నది ఇప్పుడు అసలైన చర్చ. అక్కడ ర్యాలీలపై ఆంక్షలు పెట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నప్పుడు, ఏపీలో వైఎస్సార్సీపీ నేతలు చట్టాలను హేళన చేస్తున్నా పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పోలీసులు నోటీసులు ఇచ్చినా వైసీపీ నేతలు వాటిని ఒక ప్రివిలేజ్ లాగా భావిస్తున్నారే తప్ప, చట్టం పట్ల భయం కనబరచడం లేదు. ఆంక్షలను లెక్క చేయకుండా, ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ ర్యాలీలను అరికట్టడంలో వ్యవస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
జగన్కు బాధ్యత లేదా?
ఒకరి ప్రాణం పోవడం అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, అది ఒక కుటుంబానికి తీరని లోటు. రాజకీయం అనేది ప్రజల కోసం ఉండాలి తప్ప, ప్రజల శవాల మీద రాజకీయ జెండాలు పాతడం సంస్కారం అనిపించుకోదు. ఇబ్రహీంపట్నం ఘటనలో చనిపోయిన వారు కేవలం కార్యకర్తలు మాత్రమే కాదు, వారిపై ఆధారపడిన కుటుంబాల ఆశలు. ఇలాంటి ఊరేగింపులు, రోడ్ షోల వల్ల సామాన్యుడి ప్రాణం పోతుంటే స్పందించని వ్యవస్థలు అసలు ఉన్నాయా లేదా అన్న అనుమానం కలుగుతోంది. చట్టం ఎవరికైనా ఒక్కటే కావాలి. రాజకీయ నేతల షోల కోసం అమాయక ప్రజలు బలి కాకూడదు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే రాజకీయ నేతల అహంకారం మరిన్ని ప్రాణాలను బలి తీసుకునే ప్రమాదం ఉంది.
