ప్ర‌మాణ స్వీకారం నిరాడంబ‌రంగా చేయాల‌నుకుంటున్నార‌ట‌!

Jagan
Jagan

వైయ‌స్సార్ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నాయ‌కుడిగా వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌య్యారు. ఈరోజు ఉద‌యం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో వైకాపా ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌తో జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హించారు. జ‌గ‌న్ ను శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక‌కు సంబంధించిన తీర్మాన ప‌త్రాన్ని తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర్సింహ‌న్ కు ఈరోజు సాయంత్ర‌మే అంద‌జేయ‌నున్నారు. జ‌గ‌న్ తోపాటు ప‌లువురు వైక‌పా నేత‌లు హైద‌రాబాద్ లోని రాజ్ భ‌వ‌న్ కి వ‌చ్చి గ‌వ‌ర్న‌ర్ ను క‌లుసుకోబోతున్నారు. ఆ త‌రువాత‌, ప్ర‌భుత్వ ఏర్పాటుకు సంబంధించిన లాంఛ‌నాలు ప్రారంభ‌మౌతాయి.

ఈనెల 30న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్టు మొన్న‌నే ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌లోనే ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ఉంటుంద‌న్నారు. అయితే, ఈ కార్య‌క్ర‌మాన్ని వీలైనంత నిరాడంబ‌రంగానే నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్టుగా వైకాపా వ‌ర్గాలు అంటున్నాయి. ప‌రిపాల‌న‌లో భారీత‌నం క‌నిపించాలిగానీ, ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్న‌ట్టుగా తెలుస్తోంది. కానీ, భారీ మెజారిటీతో వైకాపా పొందిన విజ‌యాన్ని ఈ సంద‌ర్భంగా సెలెబ్రేట్ చేసుకోవాల‌ని వైకాపా నేత‌లూ, కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. విజ‌య‌వాడ‌లో భారీ ఎత్తున బహిరంగ స‌భ పెట్టాల‌ని నేత‌లు ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ఉంటే ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఉంటాయ‌నీ, న‌గ‌ర శివార్ల‌లో భారీ ఎత్తున వేదిక ఏర్పాటు చేసి, ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణం చేయాల‌నేది పార్టీ నేత‌ల ఆలోచ‌న‌గా తెలుస్తోంది. క‌నీసం ఓ ఐదారు ల‌క్ష‌ల మంది జ‌నం మ‌ధ్య‌లో సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, దీనికి సంబంధించి జ‌గ‌న్ నుంచి స్ప‌ష్ట‌మైన సూచ‌న‌లు రావాల్సి ఉంద‌నీ అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com