రాజమండ్రి జైలుకు వెళ్లేందుకు జగన్ రెడ్డి నిరాసక్తత చూపుతున్నారు. ఆ జైలంటే ఆయనకు భయంగా ఉంది. అక్కడికి వెళ్లి మిథున్ రెడ్డిని పరామర్శించాల్సి ఉంది. అందుకోసం డేట్ కూడా పదిరోజుల ముందే రెడీ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ తూచ్ అన్నారు. రాజమండ్రి జైలుకు వచ్చేందుకు జగన్ రెడ్డికి తీరిక లేదని వైసీపీ తాజాగా ప్రకటించింది. మూడు రోజుల ముందు జైల్లో మిథున్‌రెడ్డిని పరామర్శించి జగన్ 25న వచ్చి ఓదారుస్తారని బొత్స ప్రకటించారు. రెండు రోజుల్లోనే మాట మార్చారు. ఇప్పుడు ఆయన పర్యటన రద్దు అయిందని వినాయక చవితి తర్వాత వస్తారని కొత్త కబుర్లు చెబుతున్నారు.
లిక్కర్ స్కామ్ నిందితుల్ని తప్ప అందర్నీ జైలుకెళ్లి పరామర్శించారు జగన్. కానీ లిక్కర్ స్కాములో అరెస్ట్ అయిన వారు ఆయనకు అత్యంత ఆప్తులు. ఇంకా చెప్పాలంటే తన దురాశ కోసం బలైన వాళ్లు. వాళ్లను పరామర్శించడానికి జగన్ కు మనసు ఒప్పడం లేదు. మిథున్‌రెడ్డి జైలుకెళ్లి చాలా కాలం అవుతున్నా పరామర్శించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయన సలహా బృందం.. పరామర్శించేందుకు వెళ్తున్నట్లుగా ఓ లీక్ పడేశారు. కానీ నిజంగా జగన్ కు రాజమండ్రి జైలుకు వెళ్లేందుకు ధైర్యం చాలడం లేదని అనుకోవచ్చు.
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అదే జైల్లో పెట్టారు జగన్. యాభై రోజుల పాటు మానసిక ఆనందం పొందారు. ఇవాళ అదే జైల్లో .. తనవల్ల జైలు పాలైనా మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లాల్సి వస్తోంది. ఇది ఆయనకు భయం కలిగిస్తుంది. రేపోమాపో ఆయన కూడా అదే జైలుకు వెళ్లాల్సి ఇస్తుందన్న భయంలో ఉన్నారు. అందుకే.. అక్కడికి పరామర్శకు వెళ్లేందుకు ఆయనకు ధైర్యం చాలడం లేదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.