ప్రధానమంత్రి నరేంద్రమోదీపై జగన్ అవినీతి ఆరోపణలు చేస్తూండటం హాట్ టాపిక్ గా మారుతోంది. యోగాంధ్ర నిర్వహణను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వంతో కలిసి చేసింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలని ప్రశంసించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ ప్రత్యేకంగా చెప్పారు.కానీ ఇప్పుడు ఈ కార్యక్రమంలో అవినీతి జరిగిందని జగన్ ఆరోపిస్తున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పలు చోట్ల గతంలో జరిగాయి. ఈ సారి ఏపీకి ఆ అవకాశం లభించింది. యోగాంధ్ర మొత్తం ఖర్చు 62 కోట్లు అయింది. ఈ 62 కోట్లలోనూ 90 శాతం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ నుంచి వచ్చాయి. ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కోసం పది శాతం నిధులను మాత్రమే ఖర్చు చేసింది. ఈ మేరకు అధికారికంగా జీవో జారీ అయింది. మరి జగన్ చెప్పిన రూ. 330 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?
అంటే కేంద్ర ప్రభుత్వం యోగాంధ్ర నిర్వహణకు రూ. 330కోట్లు బిల్లులు పెట్టుకుని మోసం చేసిందని చెప్పదల్చుకున్నారా అన్న ప్రశ్న వస్తోంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనపైనే ఇలా వందల కోట్ల ఆరోపణలు చేసే స్థాయికి జగన్ వెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే జగన్ నేరుగా కాకుండా మోదీని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ ఉద్దేశం బీజేపీ నేతలకు స్పష్టంగనే అర్థమవుతోంది. జగన్ మెల్లగా మాస్క్ తీసేస్తున్నారని.. ఇప్పుడు పరోక్షంగా .. తర్వాత నేరుగా మోదీని జగన్ టార్గెట్ చేస్తారని అనుమానిస్తున్నారు.
కాంగ్రెస్తో జగన్ సంప్రదింపులు జరుపుతున్నారని కొంత కాలంగా చర్చ జరుగుతోంది. గతంలో ఆయన ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ తప్ప ఇండీ కూటమి నేతలంతా వచ్చారు. అప్పటి నుండి జగన్ తీరులో మార్పు కనిపిస్తోంది. సమయాన్ని బట్టి .. పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మోదీపైనే ఆరోపణలు చేసేందుకు ధైర్యం చేస్తున్నాన్నారు. ముందు ముందు ఆయన రాహుల్ ను ప్రధానిని చేయడమే తన డాడీ వైఎస్ కల అని ..దాన్ని నెరవేర్చేందుకు కాంగ్రెస్ తో కలుస్తున్నానని ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న దానికి ఇవే సూచనలుగా భావిస్తున్నారు.
