ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా, వైద్య సలహా మేరకు తాను పదవుల్ని వదిలేస్తున్నానని ఆయన లేఖ రాశారు. ఆయన రాజీనామా లేఖ బయటకు వచ్చే వరకూ అలాంటి ఆలోచన ఉందని కూడా ఎవరికీ తెలియదు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు సోమవారం.. రాజ్యసభను నిర్వహించారు కూడా. అయితే విపక్షాల ఆందోళనలతో సభ సజావుగా సాగలేదు.
దూకుడైన ప్రకటనలకు పెట్టింది పేరైన ధన్ఖడ్ రాజీనామా ఊహించనిదే. రాజకీయ నాయకులు ఆరోగ్యకారణాలతో రాజీనామాలు చేయరు. రాజ్యసభ చైర్మన్ గా ఉన్న ఆయనకు పెద్ద పనేమీ ఉండదు. రాజ్యసభ ను నిర్వహించకపోయినా డిప్యూటీ చైర్మన్ .. ఇతరులు నిర్వహిస్తారు. ప్రత్యేకమైన కారణంతోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నారు.
బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వంతో ఓ ఆటాడుకున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు.. రాష్ట్రపతికి బిల్లుల విషయంలో మూడు నెలల గడువు విధించడంపై కూడా స్పందించారు. సుప్రీంకోర్టు వ్యవహారాన్ని తప్పు పట్టారు. ఇక పార్లమెంట్ ఎందుకని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు.