రివ్యూ: జై భీమ్‌

ఈ సినిమాలో ఫైట్లు లేవు .. కానీ రక్తం వుడికిపోద్ది
ఈ సినిమాలో మాస్ సీన్లు లేవు.. కానీ విజిల్స్ వేయాలనిపిస్తుంది.
ఈ సినిమాలో సూర్య తప్ప మరో స్టార్ లేడు.. కానీ పాత్రలన్నీ నక్షత్రాలుగా వెలిగిపొతాయ్
జై భీమ్ అంటే కాంతి..
జై భీమ్ అంటే ప్రేమ ..
జై భీమ్ అంటే న్యాయం..

సూర్య లాంటి న‌టుడు క‌మ‌ర్షియ‌ల్ అంశాల్ని, మాస్ ఎలిమెంట్స్‌నీ, హీరోయిజ సూత్రాల్ని ప‌క్క‌న పెట్టి చేసిన సినిమా ఇది. ఈ క‌థ‌కు ఓ మూలం ఉంది. ఈ క‌థ‌లో బాధ ఉంది. వివ‌క్ష ఉంది. త‌ర‌త‌రాలుగా జ‌రుగుతున్న అన్యాయం ఉంది. అవ‌న్నీ మేళ‌వించి సూర్య ఈ క‌థ‌ని ఎలా చూపించాడు? ఎలా చెప్పాడు? జై భీమ్ లో క‌దిలించి, ఆలోచింప‌జేసే అంశాలు ఏమున్నాయి?

రాజన్న ( మణికందన్ ) సినతల్లి ( జిమోమోల్ జోస్ ) ఆదివాసీలు. ఊరి చివర పూరి గుడిసెలో కాపురం. ఎలుకల్ని , పాముల్ని పట్టడం… కూలీపని, ఇటుకల బట్టీలో పని చేసి జీవనం గడుపుకోవడం… ఇదే వారి జీవితం. రాజాపురం ప్రెసిడెంట్ ఇంట్లో ఒక రోజు పాము దూరుతుంది. ఆ పాముని పట్టుకోవడం కోసం రాజన్నకి కబురు వస్తుంది. రాజన్న వెళ్లి పాము పట్టి వేరే చోట వదిలేస్తాడు. ఆ తర్వాత రోజే ప్రెసిడెంట్ గారి ఇంట్లో వున్న బంగారు ఆభరణాల దొంగతనం జరుగుతుంది. ప్రెసిడెంట్ వెళ్లి పోలీసు కేసు పెడతాడు. విచారణ చేపట్టిన పోలీసులు రాజన్నతో పాటు కుటుంబం మొత్తాన్ని స్టేషన్ తీసుకువెళ్లి చిత్రవధ చేస్తారు. నేరం ఒప్పుకోమని తీవ్రంగా హింసిస్తారు. ఈ క్రమంలో ఒక రోజు రాజన్నతో పాటు మరో ఇద్దరు పోలీసు స్టేషన్ నుంచి కనిపించకుండా పోతారు. మానవ హక్కుల పరిరక్షణకై పోరాటం చేసే లాయర్ చంద్రు (సూర్య). అన్యాయానికి గురౌతున్న ఆదివాసీలు, గిరిజనుల తరుపున ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పోరాటం చేసే లాయర్ చంద్రు దగ్గరికి న్యాయం కోసం వెళుతుంది రాజన్న భార్య సినతల్లి. తన కళ్ళ ముందే తన భర్తని పోలీసు స్టేషన్ లోకి తీసుకెళ్ళిన పోలీసులు .. తప్పించుకుపారిపోయాడని చెబుతున్నారని, అసలు తన భర్త ఎక్కడ వున్నాడో, అన్యాయంగా కేసులో ఇరికించిన పోలీసులు తన భర్తని ఏం చేశారో తెలియదని, తమకు న్యాయం కావాలాని లాయర్ చంద్రుని ప్రార్ధిస్తుంది సినతల్లి. ఈ కేసుని టేకప్‌ చేసిన చంద్రుకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అసలు రాజన్నని పోలీసులు ఏం చేశారు ? చివరికి రాజన్నకి న్యాయం జరిగిందా ? అనేది వెండితెరపై చూడాలి.

ఈ సినిమాలో ఏముంది ? అని అడిగితే… ఒక అన్యాయం వుంది. అన్యాయానికి ప్ర‌తీక‌గా జరిగిన న్యాయం వుంది. నిజాయితీగా బ్రతికే రాజన్న కుటుంబం .. ఆదివాసీ జాతికి చెందిన కారణం చేత అకారణంగా పోలీసుల చేత చిత్రవధకు గురౌతున్నప్పుడు ప్రేక్షకుడి ప్రాణం కూడా విలవిలలాడుతుంది. తమ కుటుంబాన్ని పోలీసులు చేసిన హింస గురించి సినతల్లి లాయర్ చంద్రుకి చెబుతుంటే ..చైర్ నుంచి లేచిన చంద్రు రక్తం మరిగిపోయినట్లు నిలిచుంటాడు. చంద్రుకి వచ్చిన ఫీలింగే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికీ కలుగుతుంది. పోలీసు దెబ్బలని భరించలేక పోలీసులు చెప్పినట్లు దొంగతనం ఒప్పుకుందామని సాంబయ్య అంటే.. ”దెబ్బలు మూడు రోజులకు మానిపోతాయ్ .. కానీ దొంగ అనే ముద్ర జీవితాంతం వుండిపోతుంది” అని రాజన్న చెప్పినపుడు .. రాజన్నలో ఎవరెస్ట్ అంత హీరోయిజం కనిపిస్తుంది. ‘మగాళ్ళం వున్నాం కదా సర్.. ఆడవారిని ఇంట్లోకి పంపించేయండి” అని పోలీసులని సాంబయ్య కోరితే.. పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నామా ? ఆదివాసీలు అంటే మనుషులు కారా ? అనే ఆలోచన వచ్చి కళ్ళు చెమ్మగిల్లుతాయి.

ఈ సినిమా పోలీసుల క్రూరత్వాన్ని చూపించింది. అదే సమయంలో పోలీసుల్లో నిజాయితీ కూడా ఆవిష్కరించింది. ఈ సినిమా అన్యాయాన్ని చూపించింది. అదే సమయంలో న్యాయం వెలిగించింది. పోలీసులు సినతల్లిని బలవంతంగా స్టేషన్ కి తీసుకెళ్ళినపుడు జడ్జి ఫోన్ చేసి ..’సినతల్లిని మర్యాదగా పోలీసు జీపులో ఆమె ఇంటి దగ్గర విడిచిపెట్టు” అని పోలీసులకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత వచ్చిన సీన్ చూస్తే… ఎక్క‌డో కాస్త ప్ర‌శాంత‌త‌. `ఇది క‌దా.. చూడాల్సింది` అనిపించే భావోద్వేగం. సినతల్లి బస్ లో వెళుతుంటుంది. ఆమె వెనుక ఎస్కార్ట్ లా పోలీసు జీపు ఫాలో అవుతుంటుంది. ఈ సీన్ కి థియేటర్ లో అయితే.. విజిల్స్ పడటం గ్యారెంటీ. న్యాయ వ్యవస్థ తలచుకుంటే ఎలాంటి వారికైనా న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించిన సీన్ ఇది. ”నీ భర్త లేడు .. రాజీకి వస్తే డబ్బు ఇప్పిస్తా ”అని డీజీపి సినతల్లిని అడిగితే.. ”నా భర్తలేడు. నా దగ్గర డబ్బు వుంటుంది. రేపు నా పిల్లలకి అన్నం పెట్టినపుడు మనకి ఈ అన్నం ఎలా వచ్చిందమ్మా అని అడిగితే మీ నాన్నని చంపిన వాళ్ళు ఇచ్చిన డబ్బుతో అని చెప్పాలా” అని సినతల్లి చెప్పిన మాట గూజ్ బమ్స్ తెప్పిస్తుంది.

ప్రతి సినిమాకి వున్నట్లే జై భీమ్ లో కూడా ఎత్తుపల్లాలు వున్నాయి. కోర్టు రూమ్ డ్రామా కావడం వలన కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. అయితే సుదీర్గ కాలంగా జరిగిన కేసు కావడంతో కొన్ని చోట్ల స్లో పేజ్ కనిపిస్తుంది. కేరళ ఎపిసోడ్ తో సినిమా వేగానికి కొంత బ్రేక్ పడినా.. ఆ ఎపిసోడ్ కథ‌కి కీలకం కావడంతో మళ్ళీ లైన్ లోకి వచ్చేస్తుంది. కోర్టులోకి రావ్ రమేష్ ఎంట్రీ తర్వాత కథ‌ ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఒక సోషల్ మెసేజ్ ని ఒక కేస్ కి లింక్ చేసి చెప్పిన దర్శకుడి నేర్పుని మేచ్చుకోకుండా ఉండలేం.

ఒక బలమైన కథ చెప్పడానికి సినిమా తప్పితే మరో మాధ్యమం లేదని మరోసారి రుజువు చేసింది జైభీమ్. ఆదివాసీలు, గిరిజనులు,ఎస్సీఎస్టీ.. అంటరానితనం .. వారికి న్యాయం.. ఇలాంటి నేపధ్యంలో బోలెడు కథలు వచ్చాయి. ఇంకా రావాలి. వారు ఎదురుకుంటున్న సమస్యలు. సమాజంలో వారికున్న స్థానం. వారి కోసం ప్రభుత్వాలు, సమాజం ఏం చేయాలి. వారిని ఎలా చూడాలి. వారికి ఎలాంటి న్యాయం జరగాలి. ఇలాంటి అంశాలపై ఇంకా బలంగా చర్చ జరగాలనే అవసరాన్ని బలంగా నమ్మాడు సూర్య. సూర్యలోని ఆ స్పృహనే జై భీమ్ సినిమాకి శ్రీకారం చుట్టింది. సూర్య ఈ సినిమాలో హీరో కాదు ఒక న్యాయంగా కనిపించాడు. ఒక హీరో సినిమా మొదలైన ముఫ్ఫై నిమిషాల వరకూ తెరపై ఒక్కసారి కూడా కనిపించడు. అతడే ఆ సినిమాకి నిర్మాత కూడా. అంటే అర్ధం చేసుకోవచ్చు.. సినిమాపై ఎంత నిజాయితీ వుంటే కానీ ఇలాంటి సినిమాలు చూసే అవకాశం ప్రేక్షకులకు రాదు.

లాయర్ చంద్రు పాత్రలో సూర్య జీవించాడు. తెరపై సూర్య కాకుండా లాయర్ చంద్రు మాత్రమే కనిపిస్తాడు. సూర్య నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అనుభవంతో లాయర్ చంద్రు పాత్రని పడించాడు. లాయర్ గా చాలా హుందాగా కనిపించాడు. రాజన్న గా మణికందన్‌, సినతల్లిగా లిజో మోల్‌ జోసేలు ఈ కథకు ఆయువు పట్టు. పాత్రల్లో జీవించారు. నిజానికి ఇది సినతల్లి కథ‌. ఆమెకే ఎక్కువ మార్కులు పడతాయి. ప్రకాశ్‌రాజ్‌, రాజిషా విజయన్‌, రావు రమేశ్‌ తదితరులు కధకు న్యాయం చేశారు.

నిర్మాణంలో సూర్య ఎక్కడా రాజీపడలేదు. కథకు కావలసింది సమకూర్చాడు.90వ దశకం నాటి వాతావరణ పరిస్థితులను ప్రతిబింబించేందుకు ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం కనిపించింది. కోర్టు రూమ్ చూస్తే అది సెట్ లా అనిపించ‌దు. కొన్ని డైలాగ్స్ అద్భుతంగా పేలాయి. ఎస్‌.ఆర్‌. కాదిర్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. షాన్‌ రొనాల్డ్‌ నేపధ్య సంగీతం బాగుంది. ఈ సినిమాని ఎంత `రా`గా చెప్పాలో… అంతే `రా`గా చూపించాడు. అప్పుడే కొన్ని స‌న్నివేశాలు మ‌న‌సుకు గుచ్చుకుంటాయి. అన్యాయం పాలైన బాధితుల నొప్పి తెలుస్తుంది. అలాంటి చోట ద‌ర్శ‌కుడు మొహ‌మాట ప‌డ‌లేదు.

జై భీమ్ సినిమాని క‌మ‌ర్షియ‌ల్ కొల‌త‌ల్లో చూడ‌కూడ‌దు. ఓ వ‌ర్గానికి జ‌రిగిన అన్యాయం వైపు నుంచి చూడాలి. జై భీమ్ ఓ సినిమా కాదు.. కొన్ని ద‌శాబ్దాల పాటు అణ‌గారిపోయిన కొన్ని జీవితాల‌కు డాక్యు మెంట‌రీ రూపం. చంద్రు లాంటి లాయ‌ర్లు కావాలి. చంద్రులా ఆలోచించే వాళ్లు కావాలి… అని బ‌లంగా అనిపించిన సినిమా ఇది.

ఫినిషింగ్ ట‌చ్‌: జై సూర్య‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పరామర్శలతో బాధితులకు భరోసా వస్తుందా !?

సొంత జిల్లా ప్రజలు అతలాకుతలమైపోయినా సీఎం జగన్ పట్టించుకోలేని తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న తర్వాత రెండు రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి, కడపతో పాటు నెల్లూరు జిల్లాలోనూ పర్యటించారు....

ఆ గోరు ముద్దలు జగనన్నవి కావట !

జగనన్న గోరు ముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అంటూ .. అంగన్‌వాడీ పిల్లలకు ఇస్తున్న ఆహారానికి పబ్లిసిటీ చేసుకుంటున్న ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తక్షణం...

టికెట్ రేట్లు తగ్గించే ఆలోచన లేదు : మంత్రి తలసాని

తెలంగాణ ప్రభుత్వానికి సినిమా టికెట్‌ ధరలు తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులతో...

ఏపీ ఉద్యోగ సంఘ నేతలను వ్యూహాత్మకంగా అవమానిస్తున్నారా !?

ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన కావాలనే ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘ నేతల్ని తీవ్రంగా అవమానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. పీఆర్సీ కోసం అదే పనిగా పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలతో...

HOT NEWS

[X] Close
[X] Close