ఓటీటీలు ఎప్పుడైతే విస్త్రుతంగా అందుఆటులోకి వచ్చాయో.. అప్పుడు రీమేక్ ల హవా బాగా తగ్గిపోయింది. అన్ని భాషల సినిమాలూ ఓటీటీలో సబ్ టైటిల్స్ తో ఉన్నప్పుడు రీమేక్ సినిమాల జోలికి ఎందుకు వెళ్తారు? కానీ అడపా దడపా రీమేక్‌లు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు నుంచి కూడా కొన్ని సినిమాలు వేరే భాషల్లోకి వెళ్తున్నాయి. మన దగ్గర ఘన విజయం సాధించిన ‘భగవంత్ కేసరి’ ఇప్పుడు తమిళంలో రీమేక్ చేశారు. ‘జన నాయగన్’ పేరుతో. విజయ్ హీరో. ఈ సంక్రాంతికి విడుదల అవుతోంది. విజయ్‌కి తెలుగులో అంతో ఇంతో మార్కెట్ ఉంది. అందుకే ఈ సినిమాని ‘జననాయకుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ కాబట్టి మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని నిర్మాతలు ఆశపడడంలో తప్పు లేదు.
కాకపోతే ఒక్కటే సమస్య. ఇది రీమేక్. తెలుగులో ఆల్రెడీ సినిమా చూసేశారు. వాళ్లకు ఈ కథ, కథనం కొత్తగా కనిపించే అవకాశం లేదు. రీమేక్‌లు చేయడం తప్పు కాదు. కానీ ఏ భాష నుంచి కథ తీసుకొన్నారో, అదే భాషలో సినిమాని డబ్ చేసి వదలాలనుకోవడం మాత్రం అత్యాసే. పైగా జనవరి 9న `రాజాసాబ్`తో ఈ సినిమా పోటీ పడుతోంది. ప్రభాస్ సినిమా వస్తోందంటే.. పక్కన ఏ సినిమా నిలబడదు. అలాంటిది ఈ రీమేక్ బొమ్మ ఏమాత్రం ప్రభావం చూపించగలదు? అన్నింటికంటే ముఖ్యంగా.. ‘భగవంత్ కేసరి’లోని చాలా షాట్లు.. మక్కీకి మక్కీ ‘జన నాయకుడు’లో దింపేశారు. కాపీ పేస్ట్ అంటారే.. అలా వుంది వ్యవహారం. దాంతో సోషల్ మీడియాలో ఈ సినిమాని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. కాకపోతే.. తమిళంలో ఈ సినిమా గట్టిగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఇది తన చివరి సినిమా అని విజయ్ గతంలోనే ప్రకటించేశాడు. సో.. ఆ సెంటిమెంట్ తో ఈసినిమాపై అభిమానులు ఎగబడే అవకాశం ఉంది.
