తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తమకు మద్దతు ప్రకటించారని.. ప్రచారం కూడా చేస్తారని రామచంద్రరావు, కిషన్ రెడ్డి ప్రకటించారు. పవన్ తో భేటీ తర్వాత మంగళవారం అర్థరాత్రి ఈ ప్రకటన చేశారు. నిజానికి జనసేన పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్న వేళ బీజేపీ నేత రామచంద్రరావు , కిషన్ రెడ్డిపవన్ కల్యాణ్‌ను కలవడం, ఆ వెంటనే పవన్ తమకు మద్దతు ప్రకటించారని స్టేట్మెంట్ ఇవ్వడం జనసేన వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవానికి, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే పొత్తుల గురించి బీజేపీ ఎలాంటి చొరవ తీసుకోలేదు. ఇప్పుడు జనసేన నాయకులు, కార్యకర్తలు నామినేషన్లు వేసి గెలుపు కోసం పోరాడుతున్న తరుణంలో, అకస్మాత్తుగా పవన్ మాకే మద్దతు అని బీజేపీ ప్రకటించుకోవడం జనసేన ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉంది.
పవన్‌ను మొహమాట పెడుతున్న బీజేపీ
పొత్తు లేకుండా పవన్ కల్యాణ్ బీజేపీ కోసం ప్రచారం చేయడం అంటే, తన సొంత పార్టీ అభ్యర్థులకు ఇబ్బందికరం అవుతుంది. క్షేత్రస్థాయిలో జనసేన గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను కాదని, పవన్ మరో పార్టీ కోసం ప్రచారం చేస్తే అది పార్టీ కేడర్‌లో తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. సొంత పార్టీ నేతలు బరిలో ఉన్నప్పుడు, అధినేతగా వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పవన్‌పై ఉంటుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం పవన్‌ను ఒక ధర్మసంకటంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అధికారికంగా ప్రకటించని పవన్
రామచంద్రరావు, కిషన్ రెడ్డి భేటీలు, ఆ తర్వాత బీజేపీ ప్రకటనపై జనసేన పార్టీ లేదా పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అందుకే బీజేపీ నేతల ఏకపక్ష ప్రకటనలు జనసేనకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి. మద్దతు అనేది పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించాలి తప్ప, బీజేపీ నేతలు తమకు తాముగా చెప్పుకోవడం పద్ధతి కాదని జనసైనికులు అంటున్నారు. జనసేన బలం ఉన్న చోట ఆ ఓట్లను కొల్లగొట్టడానికి బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఇదని, ఇది పవన్‌ను ఇబ్బంది పెట్టడమే కాకుండా జనసేన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే కుట్ర అని వారు అనుమానిస్తున్నారు.
బరిలో నిలిచిన జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏమిటి?
ఇప్పటికిప్పుడు పొత్తులు ఖరారు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసిపోయింది. మరో వారంలో పోలింగ్ ఉంది. ఒకవేళ పవన్ కల్యాణ్ నిజంగానే మద్దతు ఇస్తే, మరి బరిలో ఉన్న జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? వారిని విరమించుకోమని చెప్తారా? లేక వారిని కాదని బీజేపీకి ఓటు వేయమని పవన్ అడుగుతారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీ తన స్వార్థం కోసం పవన్ ఇమేజ్ను వాడుకోవాలని చూస్తోంది తప్ప, జనసేనను ఒక భాగస్వామిగా గౌరవించడం లేదనే సంకేతాలు ఈ పరిణామాల ద్వారా వెళ్తున్నాయి. ఇది అంతిమంగా జనసేన అభ్యర్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశమే. ఈ అంశంలో తెలంగాణలో జనసేన పార్టీ తరపున నిలబడిన వారికి రామ్ తాళ్లూరి వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
