జనవరి అంటేనే కొత్త సినిమాల సంబరం. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలతో బాక్సాఫీసు తరించిపోతుంది. ఈసారీ అదే జరిగింది. ఏకంగా 5 సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. వాటిలో మూడు సినిమాలకు సినీ ప్రియులు బ్రహ్మరథం పట్టారు. ఓ సినిమాకి ఇండస్ట్రీ (రీజనల్ సినిమాల్లో) హిట్ అందించారు. గత వారం కూడా సంక్రాంతి సినిమాల హడావుడితోనే గడిచింది. రిపబ్లిక్ డే సెలవలు సైతం.. సంక్రాంతి సినిమాలకు కలిసొచ్చాయి. ఇప్పుడు సంక్రాంతి సీజన్ ముగిసిపోయింది. మళ్లీ కొత్త సినిమాల రాక కోసం బాక్సాఫీసు ఎదురు చూస్తోంది. ఈవారం పెద్దగా మెరుపులేం లేవు కానీ, కొత్త పోస్టర్లని చూసే అవకాశం మాత్రం దక్కింది. ఈ వారం ఒకే ఒక్క సినిమా విడుదల అవుతోంది. అది కూడా చిన్న సైజు సినిమా. ‘ఓం శాంతి.. శాంతి.. శాంతి’ ఈనెల 30న ప్రేక్షకుల్ని పలకరిస్తుంది.
మలయాళంలో సూపర్ హిట్టయిన ‘జయ జయ జయహే’కి ఇది రీమేక్. అయితే.. పాత పాయింట్ నే కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాం అంటున్నారు మేకర్స్. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించారు. బ్రహ్మాజీ కీలక పాత్రధారి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. రీమేక్ సినిమా అయినా సరే, తెలుగుదనం కనిపిస్తోంది. తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా మధ్య చాలా పుకార్లు ఈమధ్య వినిపించాయి. అవి ఈ సినిమాకు పబ్లిసిటీకి ఉపయోగపడుతున్నాయి. టికెట్ రేట్ల విషయంలో నిర్మాత సృజన్ పెద్ద మనసు చేసుకొన్నారు. సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపాయలకే టికెట్ అందిస్తున్నారు. మల్టీప్లెక్స్ లో రూ.150 పెట్టి కొనాలి. ఇది ఓరకంగా మంచి రేట్లే అనుకోవాలి. రెండు రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ హడావుడి మొదలైపోతుంది. ప్రీమియర్లకు మంచి టాక్ వస్తే, టికెట్ రేట్లు ఎలాగూ అందుబాటులో ఉన్నాయి కాబట్టి.. జనం కాస్త థియేటర్ల వైపు కదిలే ఛాన్సుంది. సంక్రాంతి సీజన్ తరవాత.. ఆ జోరు కనిపించాలంటే టప టప రెండు మూడు హిట్లు పడాలి. అప్పుడే బాక్సాఫీసు దగ్గర ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మరి ఈ వారం ఏం జరుగుతుందో చూడాలి.
