క‌ట్ట‌లు తెంచుకున్న జ‌వాన్ ద‌ర్శ‌కుడి ఆవేద‌న‌

ఓ సినిమా అంటే… కోట్ల ఖ‌ర్చు
వంద‌ల మంది క‌ష్టం
ఓ ద‌ర్శ‌కుడి క‌ల‌..!

అయితే… ఒక్క షో ప‌డితే చాలు, జాత‌కం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. శుక్ర‌వారం చీక‌టి ప‌డేలోపే… సినిమాలు తెల్లారిపోతుంటాయి. బాగుంటే ఫ‌ర్వాలేదు. బాగోక‌పోతే మాత్రం అంతే సంగ‌తులు. దానికి తోడు పైర‌సీ ఒక‌టి. ఇది వ‌ర‌కు సినిమా విడుద‌లైన ప‌ది రోజుల‌కు కాపీ బ‌య‌ట‌కు వ‌చ్చేది. ఇప్పుడు అలా కాదు. తొలి రోజే.. మంచి క్వాలిటీతో సినిమాల్ని అప్ లోడ్ చేసేస్తున్నారు. దాంతో ప‌డిన క‌ష్ట‌మంతా వృథా అయిపోతుంది. అందుకే ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు పైర‌సీపై పెద్ద ఎత్తున గ‌ళం విప్పుతుంటారు. ఇప్పుడు జ‌వాన్ ద‌ర్శ‌కుడు బివిఎస్ ర‌వి కూడా అదే చేశాడు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది జ‌వాన్‌. అదే రోజున పైర‌సీ కూడా విజృంభించింది. దాంతో.. ర‌వి ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంది. మా పొట్ట‌లు కొట్టొద్దు.. పైర‌సీ చేయొద్దు.. అంటూ మొర పెట్టుకుంటున్నాడు. సినిమా అంటే ఓ రంగుల ప్ర‌పంచం అనుకుంటార‌ని, ఇక్క‌డ అలాంటి ప‌రిస్థితులుండ‌వ‌ని, నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నామ‌ని, ఇటువైపు యువ‌త‌రం రావొద్ద‌ని త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు ఈ ద‌ర్శ‌కుడు.

”మాకు కోట్లు వ‌ద్దు, బిల్డింగులు వ‌ద్దు.. అవేం లేదు. మ‌నుగ‌డ కోసం పోరాడుతున్నాం. ఇదంతా నాట‌కం. ప్ర‌తి శుక్ర‌వారం గుండెలు ప‌గిలిపోతున్నాయి. ఎన్నో ఆశ‌ల‌తో సినిమాలు తీస్తాం. మూడు రోజులు వ‌సూళ్లు బాగుంటే చాలు అనుకుంటున్నాం. కానీ శుక్ర‌వార‌మే సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. ఇక మేమేం కావాలి?? మాకు సినిమా త‌ప్ప ఇంకేం తెలీదు. మేమంతా ఏం తినాలి? పైర‌సీ వ‌చ్చాక అన్ని క‌ళ‌లూ చ‌నిపోతున్నాయి. చేతులెత్తి న‌మ‌స్కారం పెడుతున్నాం.. ద‌య‌చేసి సినిమాని థియేట‌ర్లోనే చూడండి. సినిమా టికెట్ వంద రూపాయ‌లు. అది చాలా త‌క్కువ‌. టికెట్ రేట్లు పెంచ‌మ‌ని అడుగుతున్నాం. కానీ థియేట‌ర్ల‌కు జ‌న‌మే రావ‌డం లేక‌పోతే మేం ఏం చేసేది..? టూరిస్టు బ‌స్సుల వాళ్లు సినిమాలు వేసేస్తున్నారు.. వాళ్ల‌నేం అనాలి? ఫోన్లో సినిమాలు లోడ్ చేసి ఇస్తున్నారు” అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com