నిర్మాత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్న ‘రోబో 2’

‘రోబో 2.0’ గురించి ర‌జ‌నీ అభిమానులు ఎంతగా ఆలోచిస్తున్నారో తెలీదు గానీ, టాలీవుడ్ కోలీవుడ్ నిర్మాత‌లు మాత్రం తెగ ఆందోళ‌న ప‌డుతున్నారు. దానికి కార‌ణం.. విడుద‌ల తేదీ విష‌యంలో క్లారిటీ లేక‌పోవ‌డం. ఈయేడాది దీపావ‌ళికి ఈ సినిమా వ‌స్తుంద‌నుకొన్నారంతా. కానీ రాలేదు. సంక్రాంతికి వ‌స్తుంద‌ని చెప్పారు. కానీ అప్పుడూ రావ‌డం లేదు. ఇప్పుడు వేస‌వికి షిఫ్ట్ అయ్యింది. వేస‌విలో ఎప్పుడు? అని అడిగితే ద‌ర్శ‌క నిర్మాత‌ల ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. రోబో మామూలు సినిమాకాదు. ర‌జ‌నీకాంత్ సినిమా అంటే, మిగిలిన సినిమాల‌న్నీ ప‌క్క‌కు వెళ్ళాల్సిందే. ర‌జ‌నీ సినిమాల‌కు ప‌ది హేను రోజుల‌కు ముందు, ఆ త‌ర‌వాత సినిమాల్ని విడుద‌ల చేయాలంటే వ‌ణుకు రావ‌డం స‌హ‌జం. అలాంటిది రజ‌నీ – శంక‌ర్ సినిమా, అందులోనూ రోబో 2 అంటే ఆ హంగామా, ఆ భ‌యం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కీ, అటు త‌మిళ సీమ‌కూ వేస‌వి చాలా కీల‌క‌మైన సీజ‌న్‌. వేస‌విలోనే రోబో వ‌స్తోంది. రోబో డేట్ తెలిస్తే గానీ, మిగిలిన సినిమాల డేట్లలో ఓ క్లారిటీ రాదు. ఇప్పుడు డేట్లు ప్ర‌క‌టించుకుని, అంతా సిద్ధం చేసుకున్న త‌ర‌వాత రోబో వ‌స్తోందంటే అప్పుడు వాయిదా వేయాల్సిన ప‌రిస్థితులొస్తాయి. అది ఏ సినిమాకీ మంచిది కాదు. అందుకే రోబో 2 డేట్ కోసం నిర్మాత‌లు ప‌డిగాపులు కాస్తున్నారు.

ఈ విష‌యమై కొంత‌మంది బ‌డా నిర్మాత‌లు, పంపిణీదారులు రోబో 2.0 నిర్మాత‌ల్ని క‌లిశారు. రిలీజ్ డేట్ విష‌యంలో ఓ క్లారిటీ ఇవ్వ‌మ‌ని అడిగారు. దాంతో రోబో బృందం కాస్త మెత్త‌బ‌డ‌క త‌ప్ప‌లేదు. ‘మేం రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తాం చూడండి’ అని మాట ఇచ్చారు. త‌మిళ నిర్మాత‌లు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు రోబో బృందం నుంచి ఓ ప్రెస్ నోట్ వ‌చ్చింది. అందులోనూ విడుద‌ల తేదీ లేదు. ‘ఏప్రిల్‌లో వ‌స్తాం’ అంటున్నారు త‌ప్ప‌.. డేట్ విష‌యంలో క్లారిటీ లేదు. దాంతో త‌మిళ సినీ నిర్మాత‌ల్లో కంగారూ తగ్గ‌లేదు. రోబో లాంటి సినిమా విష‌యంలో ఇంత‌టి జాప్యం ఊహించ‌నిది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. చివ‌రి నిమిషం వ‌ర‌కూ మార్పులూ చేర్పులూ త‌ప్ప‌వు. ఆర్థిక ప‌ర‌మైన వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్ట‌డానికి టైమ్ ప‌డుతుంది. అందుకే రిలీజ్ డేట్ విష‌యంలో ఓ క్లారిటీకి రాలేక‌పోతోంది చిత్ర‌బృందం. అదే అంద‌రిలోనూ కంగారు పెంచుతోంది. ఇప్పుడు అర్జెంటుగా రోబో 2 ఓ రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించినా, ఆ స‌మ‌యానికే సినిమా విడుద‌ల చేస్తార‌న్న గ్యారెంటీ లేదు. ఓ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి, ఆ త‌ర‌వాత మార్చుకోవ‌డం రోబో 2 కి అల‌వాటే. ఈసారీ అలానే జ‌ర‌గొచ్చు.

ర‌జ‌నీ సినిమా తెలుగులోనూ భారీ ఎత్తున విడుద‌ల అవ్వ‌డం ఖాయం. అందుకే ర‌జ‌నీ డేట్ కోసం మ‌న‌వాళ్లూ ఆత్రుత‌తోనే ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌కి అల్లు అర్జున్‌, మ‌హేష్ సినిమాలు రంగంలోకి దిగ‌బోతున్నాయి. వాటికీ రోబో నుంచి ‘గండం’ ఎదురు కావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com