రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట తమిళనాడులో ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. ఒకప్పుడు జయలలిత నీడలా ఉండి, అన్నాడీఎంకేను శాసించిన శశికళ, పన్నీర్ సెల్వం ఇప్పుడు అదే పార్టీ పతనానికి పరోక్షంగా కారణమవుతున్నారు. జయలలిత బ్రతికున్నంత కాలం ఏ డీఎంకేను అయితే బద్ధశత్రువుగా భావించారో, ఇప్పుడు అదే డీఎంకే విజయానికి వీరు బాటలు వేస్తున్నరాు. పార్టీపై పట్టు కోల్పోయిన కక్షతో జయలలిత పార్టీకి నష్టం చేకూర్చేలా వీరి అడుగులు పడుతున్నాయి.
శశికళ వ్యూహం – ఓట్ల చీలికతో స్టాలిన్‌కు లాభం
శశికళ తాజాగా కొత్త పార్టీ ప్రకటన చేయడం వెనుక బలమైన రాజకీయ లెక్కలు ఉన్నట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకేలో తనను చేర్చుకోకపోవడంతో, ఆ పార్టీ ఓటు బ్యాంకును దెబ్బతీయడమే లక్ష్యంగా ఆమె పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో తన సామాజిక వర్గం ఓట్లను చీల్చడం ద్వారా అన్నాడీఎంకేను బలహీనపరచాలని ఆమె భావిస్తున్నారు. ఈ ఓట్ల చీలిక అంతిమంగా అధికార డీఎంకేకే లాభం చేకూరుస్తుందని తెలిసినా, పంతం కోసం ఆమె వెనక్కి తగ్గడం లేదు.
పన్నీర్ సెల్వం స్టాలిన్‌కు బహిరంగ మద్దతు
జయలలిత జైలుకు వెళ్ళినప్పుడల్లా నమ్మకమైన బంటుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పన్నీర్ సెల్వం తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు స్టాలిన్‌ను తీవ్రంగా విమర్శించిన ఆయన, ఇప్పుడు ఏకంగా స్టాలిన్ పాలన అద్భుతంగా ఉందని, డీఎంకే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రశంసిస్తున్నారు. పళనిస్వామిని దెబ్బతీయడం కోసం తన రాజకీయ జీవితాంతం ద్వేషించిన పార్టీతో చేతులు కలపడానికి కూడా ఆయన సిద్ధపడటం దారుణమైన రాజకీయ పరిణామం.
ఒంటరిగా పోరాడుతున్న పళనిస్వామి
జయలలిత చుట్టూ ఉన్న అతిరథ మహారథులు అంతా ఇప్పుడు ప్రత్యర్థులకు సహకరిస్తుంటే, పళనిస్వామి మాత్రం అన్నాడీఎంకేను కాపాడుకోవడానికి ఒంటరి యుద్ధం చేస్తున్నారు. జయలలిత ఆశీస్సులు లేవని కొందరు విమర్శించినా, తనదైన శైలిలో పార్టీ కేడర్‌ను ఏకం చేస్తూ పళనిస్వామి ముందుకు సాగుతున్నారు. సలహాదారులు, సన్నిహితులు అని చెప్పుకున్న వారే వెన్నుపోటు పొడుస్తున్న వేళ, ఆయన పార్టీ ఉనికిని కాపాడటమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. జయలలిత ఆశయాల గురించి మాట్లాడే వారు.. ఆమె ఆశయాలకు విరుద్ధమైన పార్టీకి మద్దతు పలకడం కార్యకర్తలను విస్మయానికి గురి చేస్తోంది. అధికారం కోసం, వ్యక్తిగత పంతాల కోసం దశాబ్దాల రాజకీయ సిద్ధాంతాలను పక్కన పెట్టేసి శత్రువుల పంచన చేరారని అన్నాడీఎంకే కార్యకర్తలు రగిలిపోతున్నారు.


