కమిడియన్ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు హీరో అయిపోయాడు. గీతాంజలిలో అంజలి డామినేట్ చేసినా… ఇప్పుడు ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో జయమ్ము నిశ్చయమ్మురా లాంటి కథని ఎంచుకొన్నాడు. ఈ సినిమా ట్రైలర్లు, పాటలూ జనరంజకంగానే ఉండడంతో సినిమాకి బజ్ ఏర్పడింది. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్తో ఈ సినిమా పాస్ అయిపోయింది. ఇక జనాల నుంచి మార్కులు, కలక్షన్లూ సంపాదించుకోవడమే తరువాయి. అందుకే.. ప్రమోషన్లనీ కాస్త వెరైటీగా చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకోసం పబ్లిక్ ప్రీమియర్లను నిర్వహించాలని ప్లాన్ చేస్తోందని సమాచారం.
బడా హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలు వేస్తారు.ఆ అర్థరాత్రి ఆటల కోసం ఫ్యాన్స్ ఎగబడతారు. ఒక్కో టికెట్ నీ రూ.1000కి కొనడానికి క్యూ కడతారు. శ్రీనివాసరెడ్డి లాంటి హీరోలకు అంత సీన్ ఉండదు కదా?? అందుకే పబ్లిక్ ప్రీమియర్ అనే కాన్సెప్టుని తీసుకొచ్చారు. ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అంతకు రెండ్రోజులకు ముందే ప్రీమియర్లు మొదలైపోతాయట. ఇందుకోసం పాస్లూ, కాంప్లిమెంటరీలూ ఇస్తారట. బుధ, గురు వారాల్లో హైదరాబాద్లోని ఓ థియేటర్లో రోజుకి నాలుగు ఆటల చొప్పున ఈ షోలు కొనసాగుతాయి. అంటే విడుదలకు ముందే మౌత్ పబ్లిసిటీతో క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారన్నమాట. చిన్న సినిమా కాబట్టి, అందునా శ్రీనివాసరెడ్డి హీరో కాబట్టి ప్రీమియర్ షోల టికెట్లు అంతగా తెగకపోవొచ్చు. అందుకే ఈ సినిమా టికెట్లను మొదటి రెండు రోజులూ ఫ్రీగా పంచాలని భావిస్తున్నారట. అదీ.. ఒక థియేటర్లోనే. మరి శ్రీనివాసరెడ్డి ఎత్తుగడ ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.