ప్రొ.నాగేశ్వర్ : ఏపీ ఎన్నికల్లో వేల కోట్ల ఖర్చు..! ఎవరు గెలిచినా దోపిడీ తప్పదా..?

ఎన్నికల ఖర్చుపై ఇప్పుడు దేశం మొత్తం ఓ రకమైన చర్చ జరుగుతోంది. దక్షిణాదిలో.. ఎన్నికల ఖర్చు మరీ ఎక్కువని చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే.. మొన్నటి ఎన్నికల్లో ధనప్రవాహం జరిగింది. జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలు.. ఎన్నికల ఖర్చుపై బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఓటర్లు నేరుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని… ఆయన అంటున్నారు. ఓటుకు రూ. రెండు వేల వరకూ పంపిణీ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. రెండు పార్టీలు కలిపి ఈ ఎన్నికల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 10వేల కోట్లు ఖర్చు పెట్టాయని.. తన నియోజకవర్గంలోనే రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా మందిలో ఉన్న ఆవేదనే.

ఏపీ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేశారన్నది నిజం..!

జేసీ దివాకర్ రెడ్డి… రెండు పార్టీలు కలిపి రూ. 10వేల కోట్లు ఖర్చు పెట్టారని.. లెక్క వేశారు. అయితే.. కచ్చితంగా అంతే మొత్తం ఖర్చు పెట్టారని చెప్పలేదు. అంతే ఖర్చు పెట్టి ఉండవచ్చు.. కొంచెం అటూ ఇటూ అయినా ఖర్చు పెట్టి ఉండవచ్చు. నియోజకవర్గాల్లోనూ… జేసీ చెప్పినట్లు ఖర్చు పెట్టి ఉంటారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ.. మరికొన్ని నియోజకవర్గాల్లో తక్కువ అయి ఉంటుంది. గట్టి పోటీ ఉన్న చోట్ల సహజంగానే ఎక్కువ ఖర్చు పెట్టారు. పెద్దగా పోటీ లేని చోట… ఖర్చు తక్కువే. అయితే ఈ సారి ఇలాంటి నియోజకవర్గాలు తక్కువ. ఎన్నికల్లో ఇంత డబ్బు ఖర్చవడానికి కారణం ఏమిటి..? స్వభావం ఏమిటి..? నియంత్రించలేమా.. ? అన్న ప్రశ్నలు వస్తూంటాయి. రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకునే స్వభావం మారుతోంది. రాజకీయాల్లోకి వస్తున్న వారు… సర్వసంగ పరిత్యాగులు కాదు. వారు ఎన్నికల్లో ఖర్చు పెట్టి… మరింత సంపాదించడానికి వస్తున్నారు. రాజకీయాన్ని నీతిగా చేసే వారు కొంత మంది ఉండవచ్చు. కానీ ఇప్పుడు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్న వారు వ్యాపార ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఓ ఎమ్మెల్యే రూ. 20 కోట్లు ఖర్చు పెడితే.. అంతకు డబుల్ సంపాదిస్తున్నారు.

రాజకీయాల్ని వ్యాపారంగా చేసుకున్నవారే రాజకీయ నేతలు..!

ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో సర్వాధికారిగా మారిపోతారు. ప్రభుత్వ అధికారులు తాను చెప్పిన వారే ఉండాలన్నట్లుగా ఉంటారు. ఆ తర్వాత ఇసుక సహా.. అభివృద్ధి పనులు.. ప్రతీ దాంట్లోనూ.. కమిషన్లు పొందుతారు. ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల విషయాల్లోనూ కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు పొందుతారు. ఐదేళ్లకు ఓ రాష్ట్ర బడ్జెట్… ఏడెనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది. అంటే అంత మొత్తం ఖర్చు చేస్తారు. ఇందులో.. ఒక్క శాతం అవినీతి ఉందంటే.. ఏడెనిమిది వేల కోట్లు ఉంటుంది. అదే టూ పర్సెంట్ అయితే.. పదహారు వేల కోట్లు ఉంటుంది. సహజంగా అవినీతి అంత కన్నా ఎక్కువే ఉంటుంది. దేశంలో ఇతర ఏ రంగంలో తీసుకున్నా.. రాజకీయాల్లో అతి ఎక్కువ అవినీతి ఉంటుంది. అన్ని వ్యాపారాల్లో కన్నా… రాజకీయ వ్యాపారాల్లోనే ఎక్కువ ఆదాయం కూడా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టి.. రాజకీయం చేసే వారు.. వ్యాపారంలాగానే చూస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన వారు పూర్తిగా.. వ్యాపారిలాగానే వ్యవహరిస్తారు కానీ ప్రజాసమస్యలను పట్టించుకోరు.

పార్టీలదే మొదటి తప్పు..! తమ డబ్బే పంచుతున్నారని జనం అనుకుంటున్నారు..!

అసలు సమస్య ఎక్కడ వస్తోంది అంటే… రాజకీయ పార్టీల దగ్గరే వస్తోంది. ఎన్నికల్లో పోటీ కోసం.. ఎవరైనా వెళ్లినప్పుడు.. ముందుగా రాజకీయ పార్టీలు ఆర్థిక స్థోమత చూస్తున్నాయి. ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడతారని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఏ టిక్కెట్ ఇస్తే ఎంత ఖర్చు పెడతారు..? అనే వివరాలు ఆరా తీస్తారు. దగ్గర్లో.. రిజర్వుడు నియోజకవర్గాలు ఉంటే.. ఖర్చు కూడా మీరే పెట్టుకోవాలని సూచిస్తూ ఉంటారు. పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు.. అంటూ బేరం పెడతారు. రాజకీయ పార్టీకి.. బ్రహ్మాండంగా.. గెలవడానికి అవకాశం ఉన్న చోట కూడా.. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా.. ఆర్థిక బలం చూసి టిక్కెట్ ఇస్తున్నారు. అక్కడే మొదటి తప్పు జరుగుతోంది. ఎన్నికల కమిషన్ కూడా… ఎన్నికల ఖర్చు విషయంలో పూర్తిగా విఫలమయింది. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నికలకు.. డబ్బులు ఓ సవాల్‌గా మారాయి. దీన్ని సవాల్‌గా తీసుకోవడంలో ఈసీ విఫలమయింది. ప్రజలు కూడా.. తీసుకోవడంలో తప్పు అని అనుకోవడం లేదు. రాజకీయ నేతలు అంత .. అంత దోచుకుంటున్నారు… అది మా డబ్బే కాబట్టే తీసుకుంటే తప్పేం లేదనుకుంటున్నారు. డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు.

ఈసీ విఫలం..! రాజకీయ పార్టీలే మార్పు తేవాలి..!

రాజకీయ పార్టీలు… ఇప్పుడు ఓ కొత్త దారిని చూపించాలి. ఏదో ఓ పార్టీ… ముందుకు వచ్చి డబ్బులు పంచబోమని.. చెప్పి.. రాజకీయం చేయాలి. గెలవగలిగే అవకాశం ఉన్న ఏదో ఓ పార్టీ ముందుకు వస్తే… పరిస్థితి మారే అవకాశం ఉంది. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా..దీనికి సుముఖంగా లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ డబ్బులు ఖర్చు పెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తూంటారు కానీ.. పరిష్కార మార్గాలు వెదికే ప్రయత్నం మాత్రం చేయరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com