తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త ఏడాది తొలి రోజు తాడిపత్రిలో దీక్ష చేపట్టారు. ఆయనకు ఎవరిపైనో కోపం ఉందని అది దీక్షలో బయటపెడతారని అందరూ అనుకున్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఆ కోపం తనపైనే అని.. తన ప్రవర్తన ఇటీవలి కాలంలో ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని.. వాటి గురించేతాను దీక్ష చేపట్టినట్లుగా ప్రకటించారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా తాను ఎంత నిధులు ఖర్చు చేశాను, ఏఏ అభివృద్ధి పనులకు ఎంత వెచ్చించాను అనే వివరాలు ఫ్లెక్సీల్లో ఉన్నాయి.
అసలు తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుందో వివరించేలా కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. గాంధీ బొమ్మ సెంటర్ టెంట్ వేసుకుని కూర్చున్న ఆయన తన మనసులోని అభిప్రాయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రజల అభిప్రాయం మేరకే తన ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2026 నాటికి తాడిపత్రిని మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ప్రజలకు ఏమైనా సందేహాలుంటే తనను నేరుగా సంప్రదించేందుకు ఫోన్ ద్వారా కూడా అందుబాటులో ఉంటా.. వారు అడిగే ప్రతి రూపాయికి లెక్క చెప్తా అని ప్రకటించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి తరచుగా అధికారుల నిర్లక్ష్యంపై లేదా పట్టణంలోని పారిశుధ్యం, అభివృద్ధి పనుల విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ ఇలాంటి దీక్షలు చేపడుతుంటారు. ఈసారి ఆయన మనసులోని మాట అని పేర్కొనడం ..తన ప్రవర్తనపైనే తాను ఇలా చేస్తున్నాని చెప్పడంతో మరోసారి జేసీ స్టైలే వేరని అందరూ చర్చించుకోవడం ప్రారంభించారు.
