కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జగిత్యాల సీనియర్ నేత జీవన్ రెడ్డిని కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్.. పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను కలవాలని కోరారు. రెండు మూడు రోజుల్లో అపాయింట్ మెంట్ ఖరారు చేసి జీవన్ రెడ్డిని ఫామ్ హౌస్ కు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జగిత్యాలలో బీఆర్ఎస్ నేతలు బలప్రదర్శన చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు.
అంతకు ముందే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ డ్యూటీ ఎక్కేశారు. రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని ఆయన ఉదయం నుంచి వరుసగా మీడియా ప్రతినిధులకు ఇంటర్యూలు ఇస్తూ చెప్పారు. పదేళ్ల కేసీఆర్ పాలనతో పోలిస్తే, ప్రస్తుత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన తిరోగమనంలో ఉందని, గత ప్రభుత్వమే ఎంతో మెరుగ్గా ఉండేదని జీవన్ రెడ్డి కితాబు ఇచ్చారు. రేవంత్ రెడ్డి పార్టీని తన సొంత జాగీరుగా భావిస్తున్నారని, రాహుల్ గాంధీ మార్క్ ఎక్కడా కనిపించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలోకి వెళ్తుందని ప్రజలు నమ్ముతున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగానే తాను కారు ఎక్కుతున్నానని స్పష్టం చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించడమే కాకుండా, తనను రాజకీయంగా అణిచివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్లో చేరేటప్పుడు.. బీఆర్ఎస్ ను పొగడక.. కాంగ్రెస్ ను పొగుడుతారా అని ఎవరికైనా అనిపిస్తుంది కానీ.. పార్టీలో చేరక ముందే ఆయన భజన ప్రారంభించడాన్ని కాంగ్రెస్ వర్గాలు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాయి.
