`వృషభ’వృత్తాంతం:జయలలితకు కీడు ?

విశ్లేషణ

జల్లికట్టు (పొగరబోతు ఎద్దులను లొంగదీసుకునే క్రీడ) నిర్వహించే విషయంలో సుప్రీంకోర్టు అడ్డుతగలడమన్నది తమిళ ప్రజలకు ఈ పొంగల్ పర్వదిన రోజుల్లో పెద్దఎత్తున నిరుత్సాహమే కలిగించి ఉంటుంది. ఆమాట కొస్తే ముఖ్యమంత్రి జయలలిత కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే చెప్పాలి. మరోపక్క రాజకీయాలు నడపడంలో విశేష అనుభవం గడించుకున్న జయలలిత ప్రతిష్టాత్మకమైన జల్లికట్టుకి అనుమతి తెప్పించుకోలేక పోయారన్న విమర్శలు మొలకెత్తాయి. మరివీటిని ఆమె ఎలా తిప్పికొడతారో చూడాలి.

మరికొద్ది నెలల్లోనే అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఈ `వృషభ వృత్తాంతం’ ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. కేవలం ఎద్దులతో సరదాగా జరుపుకునే క్రీడకు రాజకీయ రంగులు పులుముకున్నాయి. పొగరబోతు గిత్తలా రాజకీయాలు దూసుకెళ్లబోతున్నాయి. ఇప్పటికే డిఎంకే సహా ఇతర ప్రతిపక్షపార్టీలు- వృషభ రాజాన్ని ఎలా తమ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలా- అని ఆలోచిస్తున్నారు.

జల్లికట్టుపై విధించిన `స్టే’ను పునఃపరిశీలించాలని దాఖలైన పిటీషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణచేపట్టి, అంతకు ముందు విధించిన స్టే కొనసాగుతుందని తేల్చిచెప్పింది. దీంతో ప్రస్తుతానికి తమిళనాట జల్లీకట్టు లేదనే అనుకోవాలి. మరో వైపున జల్లికట్టు నిర్వహణ విషయంలో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలంటూ జయలలిత నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆఖరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరుగుతుందన్న ఆశమాత్రమే తమిళప్రజలకు ఇప్పుడు మిగిలింది.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా తమిళనాట జల్లికట్టును ఒక క్రీడగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇది, మూగజీవాలకు హాని కలిగించే క్రీడేనంటూ భారత జంతు సంరక్షణ సమితితో సహా `పెటా’ వంటి స్వచ్ఛంధ సంస్థలు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో కథ అడ్డంతిరిగింది. కేంద్రం ఎగ్జిక్యూటీవ్ నోటిఫికేషన్ జారీ చేసినా సుప్రీంకోర్టు మాత్రం జల్లీకట్టు నిర్వహించకూడదంటూ స్పష్టం తేల్చిచెప్పింది.

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతికి కోడిపందేలు ఎలాగో తమిళనాట సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, జల్లికట్టు నిర్వహించడం వాటిపై పందేలు కాయడం కూడా అలాంటిదే. ఒక రకంగా చెప్పాలంటే, జల్లికట్టు అనేది తమిళుల భావోద్వేగాల అంశం. అంత సున్నితమైన అంశం కావడం వల్లనే ముఖ్యమంత్రి జయలలిత తెలివిగానే చొరవ చూపించారు. గతంలో మోదీని కలుసుకున్నప్పుడే జల్లికట్టు విషయం ప్రస్తావించారు. ప్రధాని సైతం సానుకూలంగా స్పందించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ చేత ఎగ్జిక్యూటీవ్ నొటిఫికేషన్ ఇప్పించారు. అయితే సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలవడంతో ఎగ్జిక్యూటీవ్ పవర్స్ కీ, జ్యూడిషియల్ పవర్ కీమధ్య గెలుపెవరిదన్నట్టుగా వాదనలు జరిగాయి. చివరకు జ్యూడిషయల్ పవర్ దే పైచేయి అయింది. కేంద్రం జారీచేసిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాన్ని సడలింపు కోసం చేసిన ఆఖరి ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. మరోపక్క జయలలిత కేంద్రం నుంచి ఆర్డినెన్స్ తెప్పించాలని కూడా ప్రయత్నించే పరిస్థితి ఏర్పడింది.

జయలలిత ఇంత తీవ్రంగా ఒక గ్రామీణ క్రీడ కోసం పోరాటం చేయడం వెనుక అసలు ఉద్దేశం రాజకీయమే. తాను ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ప్రతిపక్షం – ప్రధానంగా డిఎంకే రాబోయే ఎన్నికల్లో వృషభ వృత్తాంతాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకోవడం ఖాయం. తమిళనాడులో మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితిల్లో వృషభం రంకెలు పెడితే చివరకు అది ఎవరికి లాభిస్తుందో చూడాల్సిందే. ప్రచార సభల్లో తన తప్పు లేదని చెప్పడానికే జయలలిత ఇప్పుడు అంత తీవ్రంగా స్పందించారు. ఆమె ప్రచారసభల్లో తప్పంతా కేంద్రంపైనే తోసేయవచ్చు. కానీ ప్రతిపక్షాలు అలాకావు…అవి కచ్చితంగా జయలలిత చేతకానితనం వల్లనే తమిళనాడులో జల్లికట్టు క్రీడలు జరగలేదనీ, ప్రజల మనోభావాలను `అమ్మ’ దెబ్బతీశారంటూ ప్రచారంచేస్తుంది. మొత్తానికి రాబోయే ఎన్నికలపై వృషభం తన ప్రభావం తాను చూపబోతున్నది. చివరిగా మరో విషయం. తమిళనాట రాజకీయ దిగ్గజాల్లో ఒకటైన అన్నాడిఎంకెతో పొత్తుపెట్టుకునే విషయంలో ఆ రాష్ట్ర బిజెపీకి ఈ సమస్య అడ్డం తగలొచ్చు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com