జోగి రమేష్ అచ్చంగా బ్రహ్మానందంలాగానే బిహేవ్ చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో అసలు విషయం వెలుగులోకి వచ్చే సరికి ఆయన బుకాయింపులు అలాగే ఉన్నాయి. కానీ ఆయన ప్రతి బుకాయింపుకి బలమైన ఆధారం బయటకు వస్తోంది. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
నకిలీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు .. అంతా జోగి చెబితేనే చేశానని ప్రకటించారు. ఆ వీడియో సంచలనం అయ్యాక.. జోగి రమేష్ ఉలిక్కి పడ్డారు. అద్దేపల్లి మొదట తన పేరు చెప్పలేదని.. ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పారు. ఆయన ఎవరో మీకు తెలియదా అని గట్టిగా అన్ని వైపుల నుంచి ప్రశ్నలు వచ్చే సరికి ..తెలుసు.. మా తాత, వాళ్ల తాత ఒకే వీధిలో ఉండేవారని విచిత్రమైన సమాధానం చెప్పారు. తర్వాత ఆయన ఎవరో తనకు తెలుసు కానీ స్నేహితుడు కాదు అని చెప్పుకొచ్చారు.
తన ఇంటికి ఎప్పుడూ అద్దేపల్లి జనార్దన్ రాలేదని కూడా చెప్పారు. కానీ కాసేపటికే అద్దేపల్లి .. జోగి రమేష్ తో చేసిన వాట్సాప్ చాట్ వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఆయనే ఇంటికి రమ్మని అందులో సూచించారు. ఫేస్ టైమ్ లో కాల్ చేస్తే మాట్లాడుదామని కూడా చెప్పారు. ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావని కూడా అడిగారు. ఈ వాట్సాప్ చాట్ బయటకు రావడంతో జోగి రమేష్ కిక్కురుమనలేదు.
దేనికైనా సిద్ధమని.. కేసులకు భయపడబోనని ఆయన భీకరమైన ప్రకటనలు చేస్తున్నారు. ఈ కేసులో ఇరికించి జైలుపాలు చేయాలనుకుంటున్నారని అంటున్నారు. ఆయనను ఇరికిస్తారో లేదో కానీ.. అన్ని ఆధారాలు బయటకు వస్తున్న సమయంలో ఆయన “వాంట్ టు టాక్ రైట్ నౌ నెల్లూరు పెద్దారెడ్డి” అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పెద్దారెడ్డి అందుబాటులో లేకుండా పోయారు.