బీజేపీలో చేరిన ఆ లీడర్లు రాడార్‌లో లేరేంటి..?

భారతీయ జనతా పార్టీ ఆకర్ష్‌లో పడిన కొంత మంది ముఖ్యనేతలు ఇటీవలి కాలంలో… ఆ పార్టీలో చేరిపోయారు. వారంతా బాగా నోరున్న వాళ్లే. పీసీసీ చీఫ్ రేసులో ఉన్న డీకే అరుణ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు.. వాళ్లంతా కనిపించడం లేదు. కనీసం.. మీడియా ఎదుట నోరు విప్పడానికి కూడా వారికి అవకాశం లేకుండా పోయింది. బీజేపీలో ఏదైనా… సొంతంగా చేయడానికి లేకపోవడమే దీనికి కారణం అంటున్నారు.

డీకే అరుణ ఎందుకు సైలెంటయిపోయారు..?

గద్వాల నేత డీకే అరుణకు ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. టీఆర్ఎస్ సర్కార్‌పై ఆమె కాంగ్రెస్‌లో ఉండి తీవ్రంగా పోరాడారు. ఆమె విమర్శలకు.. టీఆర్ఎస్ నేతలు ఇచ్చే కౌంటర్లు.. సరిపోయేవి కావు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆమె… ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచి ఆమె కనిపించడం లేదు. కనీసం ఒక మీడియా సమావేశం కూడా పెట్టలేకపోయారు. కనీసం పార్టీ కార్యలయానికి కూడా రావటం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ అరుదుగా పాల్గొంటున్నారు. కేంద్ర స్థాయి నేతలు వచ్చినప్పుడు మాత్రం హాజరు వేయించుకుంటున్నారు. ఎవరూ మీడియాతో మాట్లాడవద్దని.. ఆదేశాలు ఉన్నాయని.. అలాగే.. పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశాలకు పిలుపు రావడం లేదని… డీకే అరుణ వర్గీయులు… ఆవేదన చెందుతున్నారు.

బీజేపీలో ఎవరైనా పై నుంచి చెబితేనే మీడియా ముందుకెళ్లాలా..?

ఇక కాంగ్రెస్ నుంచి కొద్ది రోజలు కిందట.. పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్ అనే నేతలు కూడా చేరారు. వీరికి క్షేత్ర స్థాయిలో ప్రజాబలం లేకపోయినా రాజకీయాలకు కావాల్సిన నోరుంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్ పై… రోజూ విమర్శలు చేస్తూ మీడియా ముందు హడావుడి చేసేవారు. సీఎల్పీలో అదే పనిగా ప్రెస్‌మీట్లు పెట్టేవారు. కానీ బీజేపీలో చేరిన తరువాత ఆయన తీరులో మార్పు వచ్చింది. నోరెత్తలేకపోతున్నారు. కనీసం పార్టీ ఆఫీసుకు వెళ్లలేకపోతున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం ఒకటి రెండు మీటింగ్స్ కు తప్ప బీజేపీ ఆఫీస్ రాలేదు. అయితే ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు మాత్రనే కార్యాలయానికి.. మీడియాకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ పాత నాయకులు మాత్రం ఎప్పటిలానే పార్టీ కార్యాలయానికొస్తున్నారు.

అందరూ “నాగం” ఖాతాలో చేరిపోతున్నారా..?

బీజేపీలో చేరి రాడార్‌లో కనిపించకుండా పోయిన నేతలను .. నాగం జనార్దన్ రెడ్డితో పోలుస్తున్నారు. బీజేపీ చేరాక తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలపోతున్నానని నాగం చెప్పుకుని బాధపడ్డారు. బీజేపీలో ఎవరైనా మీడియాతో మాట్లాడాలంటే.. ముందుగా రాష్ట్ర అధ్యక్షుడి అనుమతి తీసుకోవాల్సి ఉంటోందని.. అంతే కాకుండా.. ఏఅంశంపై మాట్లాడాలనుకుంటున్నారో.. అధ్యక్షుడికి చెప్పాల్సి ఉంది. సొంత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకు ఇది సహజంగానే నచ్చదు. ఈ కారణంగానే నాగం జనార్దన్ రెడ్డి బయటకు వచ్చారని అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ తెలిసిన తర్వాత కూడా.. ఇంకా ఎంత మంది బీజేపీ గూటికి చేరుతారో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com