భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుందన్న ఘనత తెలుగు సినిమా పరిశ్రమ సొంతం. అలాగే అత్యంత ఎక్కువ మంది నటులు ఉన్న పరిశ్రమ కూడా మనదే అయి ఉంటుంది. కానీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ మాత్రం తెలుగు సినీ నటులకు ఎప్పుడూ రాలేదు. అన్యాయం జరిగింది. లాబీయింగ్‌లో ఫెయిల్ అయ్యాం అనే మాటలు పక్కన పెడితే మన దగ్గర వస్తున్న సినిమాలకు, ఆ సినిమాలలో మనవాళ్ళు ప్రదర్శించే హీరోయిజానికి ఆ స్థాయి అవార్డులు వచ్చేంత సన్నివేశం లేదన్న మాట వాస్తవం. గతంలో వచ్చిన సినిమాల విషయం వదిలేద్దాం. ఇప్పుడొస్తున్న సినిమాలు ఏంటి? వాటిలో మన హీరోల హీరోయిక్ యాక్టింగ్ విషయం ఏంటి? గతంలో వచ్చిన సినిమాల స్టైల్లోనే మన డైరెక్టర్స్ అందరూ కొత్త సినిమాలను వండి వారుస్తున్నారు. ఇక హీరోల యాక్టింగ్ కూడా సేం టు సేం. అంతా అదే హీరోయిజం. తెలుగు స్టార్ హీరోని వేరే ఏ క్యారెక్టర్ కూడా అవహేళనగా దూషిస్తూ మాట్లాడకూడదు. ఇక చెంపదెబ్బ కొట్టించుకోవడాలు, తిట్టించుకోవడాలు లాంటివాటికైతే మన హీరోలు అస్సలు ఒప్పుకోరు. తెలుగు హీరో తల్చుకుంటే ఐశ్వర్యారాయ్ అయినా సరే.. అరక్షణంలో లవ్‌లో పడాల్సిందే. అందరిపైనా హీరోనే కుళ్ళు జోకులు వేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళేమో హీరోకి భజన చేస్తూ ఉంటారు. ప్రపంచాన్నే గడగడలాడించగల శక్తి ఉన్న విలన్ కూడా తెలుగు హీరో ముందు కమెడియన్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంతా కూడా సినిమాటిక్‌గా ఉంటుంది వ్యవహారం.
తెరపైనే కాదు తెరవెనుక కూడా మన స్టార్ హీరోల్లో చాలా మంది బిహేవియర్ ఇలాగే ఉంటుంది. అయ్యగారి పేరు అదిరిపోయే రేంజ్లో తెరపైన పడాలి. ఇంట్రడక్షన్ సీన్ కేకలు పెట్టించేలా ఉండాలి. చేస్తోంది బిచ్చగాడు క్యారెక్టర్ అయినా, భైరాగి క్యారెక్టర్ అయినా ఇది మాత్రం మస్ట్. అలాగే సినిమా అంతా కూడా తనే కనిపించాలి. మొదటి సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకూ హీరోనే ఉండాలి. సీన్ ఓపెనింగ్, అలాగే ఎండింగ్ కూడా హీరో పైనే ఉండాలి. ఇదే విషయాన్ని ఆ మధ్య ఓ బ్లాక్ బస్టర్ హిట్ తీసిన ఓ డైరెక్టర్ చాలా గర్వంగా చెప్పాడు. ఈయనగారు ఆ సినిమా హీరోకి భక్తుడు కూడా. అలాగే మన హీరోలు ఇంకో రూల్‌ని కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ ఉంటారు. సినిమాలో కనిపించే వేరే ఏ నటుడికి కూడా తనకంటే ఎక్కువగా పేరు రాకూడదు. అందరూ కూడా తన గురించి, తన యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఆ తర్వాతే వేరే ఎవరి గురించైనా మాట్లాడుకోవాలి. అట్టే మాట్టాడితే సినిమా గురించి, డైరెక్టర్ గురించి కూడా హీరోగారి పెర్ఫార్మెన్స్ గురించి కంటే ఎక్కువ మాట్లాడుకోకూడదు. అదేమంటే అభిమానులు ఒప్పుకోరని నంగనాచి కబుర్లు చెప్తారు. కొత్త కథలు రాలేదు, మమ్మల్ని ఛాలెంజ్ చేసే స్థాయి క్యారెక్టర్స్ రావడం లేదు అని మీడియా ముందు కబుర్లు చెప్తూ ఉంటారు కానీ ఇన్ని కండిషన్స్ మధ్య కొత్త కథలు ఏం వస్తాయి. ఒక వేళ వచ్చినా ఈ మసాలాలు అన్నీ యాడ్ అయ్యాక అది కూడా పాత కథనే అవుతుంది కదా.
కానీ ఒకే ఒక్క స్టార్ హీరో ఈ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేశాడు. కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఈ జెనరేషన్ హీరోలందరిలోకి ది బెస్ట్ యాక్టర్‌గా విమర్శకుల ప్రశంసలందుకుంటున్న ఎన్టీఆరే ఈ కొత్త ట్రెండ్‌కి నాంది పలికాడు. తెరపైన తనకంటే ముందు గొప్ప నటుడు అయిన మోహన్‌లాల్ పేరు రావడానికి ఒప్పుకున్నాడు. అలాగే ఈ సిినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కూడా చాలా మామూలుగా ఉంటుంది. ఆ తర్వాత కూడా అన్ని క్యారెక్టర్స్‌తో పాటు తనూ కథలో భాగమయ్యాడు. తన స్టార్డం, సినిమాటిక్ హీరోయిజం కోసం ఎక్కడా కూడా కథను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయలేదు. అలాగే తన యాక్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎక్కడా కూడా హీరోలా కాకుండా ఆనంద్ అనే కుర్రాడిలా కనిపించడానికి చాలా చాలా ట్రై చేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక మోహన్‌లాల్‌కే ఎక్కువ పేరు వచ్చే అవకాశం ఉంటుందని తెలిసి కూడా ‘జనతా..’లో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే స్వయానా ఎన్టీఆరే చెప్పినట్టుగా మోహన్‌లాల్ కంటే ఎన్టీఆర్ బాగా చేశాడని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. అయితే ఎన్టీఆర్ కూడా తన ప్రయత్నం తానూ నిజాయతీగా చేశాడు. ఏళ్ళ తరబడి హీరోగా చేసిన ఎన్టీఆర్…ఇప్పుడు సడన్‌గా నటుడిగా కనిపించే ప్రయత్నం చేస్తుంటే అభిమానులకు పూర్తి స్థాయిలో నచ్చకపోవచ్చు. అలాగే ఎన్టీఆర్ నటనలో కూడా లోపాలు కనిపించొచ్చు. కానీ సినిమాలో చాలా లోపాలు ఉన్నప్పటికీ కొంతమందికైనా సినిమా చాలా బాగా నచ్చిందంటే ఆ కొత్తదనమే కారణం.
ఎన్టీఆర్‌తో సహా వేరే ఏ హీరో అయినా కూడా జీవితాంతం హీరోగా అయితే ప్రస్థానం కొనసాగించలేడు. స్టార్ హీరోగా అయితే అస్సలు కుదరదు. అదే నటుడిగా అయితే మాత్రం బ్రతికున్నంత కాలం సినిమాలు చేస్తూ ఉండొచ్చు. చరిత్రలో నిలబడిపోవచ్చు. భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమాలో అయినా యాక్ట్ చేయగల సామర్థ్యం ఉంటుంది. అలాగే క్యారెక్టర్స్ అన్నీ కథలో ఇమిడిపోయే సినిమాలు రూపొందినప్పుడు వాటిని దేశంలో ఉన్న ఏ భాషలోనైనా డబ్బింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మార్కెట్ స్థాయి కూడా పెరుగుతుంది. తెలుగు సినిమా కళామతల్లి స్థాయి పెరుగుతుంది. అన్నింటికీ మించి ఇఫ్పుడు ప్రేక్షకుల అభిరుచులు చాలా మారాయి. సినిమాటిక్ హీరోయిజం, వంశం, బ్లడ్, పులి, సింహం…లాంటి హీరోయిజాన్ని చూడడానికి, రొటీన్ మాస్ మసాలా సినిమాలను తీసేవాళ్ళను ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని మొదటగా రియలైజ్ అయిన తెలుగు స్టార్ హీరో ఎన్టీఆరే. మేమూ నటించగలం, మాకూ నటన వచ్చు అన్న నమ్మకం ఉన్న మిగతా స్టార్ హీరోస్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అయితే ఇంకా టాప్ పొజిషన్‌కి రీచ్ అవుతారు. ఎక్కువ మంది ప్రేక్షకులకు అభిమానపాత్రులవుతారు. నటన రాకుండా డ్యాన్సులు, ఫైట్స్‌తో కాలక్షేపం చేసేవాళ్ళు మాత్రం సినిమాటిక్ హీరోయిజం ఉన్న సినిమాలకు పరిమితమైతేనే బెటర్. మిగతావాళ్ళ విషయం ఎలా ఉన్నా ఎన్టీఆర్ మాత్రం ఇదే రూట్లో కంటిన్యూ అవుతూ ఇంకా కొత్త కొత్త కథలు, కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయగలిగితే మాత్రం తెలుగు నుంచి.. మొదటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తన పేరు మీద లిఖించుకునే అవకాశం ఉంటుంది. అదే సాధించాడంటే మాత్రం తెలుగు సినిమాకు స్టార్డం తీసుకొచ్చిన స్వర్గీయ నందమూరి తారకరామారావుకి నిజమైన వారసుడని అనిపించుకుంటాడు. అర్థవంతమైన కొత్త ట్రెండ్ సృష్టించిన ఎన్టీఆర్‌కి అభినందనలు.