జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేసుకున్న అజహరుద్దీన్ ను రేవంత్ రెడ్డి ట్రాక్ నుంచి తప్పించారు. ఆయన పేరును మొదటి నుంచి పీసీసీ వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు ఎవరికి చాన్స్ వస్తుందన్నది చర్చనీయాశంగా మారింది. చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. రేవంత్ మనసులో ఎవరు ఉన్నారన్నది మాత్రం బయటకు రాలేదు. కానీ ఎక్కువగా నవీన్ యాదవ్ పేరే వినిపిస్తోంది.
జూబ్లిహిల్స్ లో చిన్న శ్రీశైలం యాదవ్ పేరు తెలియని వారు ఉండరు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనంటే భయంతో కూడిన గౌరవం ఇచ్చేది. అలాంటి ఇమేజ్ ఉన్న ఆయన కుమారుడే నవీన్ యాదవ్. బస్తీల్లో పట్టు ఉన్న కుటుంబం. ముస్లిం వర్గాల్లోనూ వారికి పట్టు ఉంది. వారి ఇమేజ్ కారణంగా ప్రధాన పార్టీలు టిక్కెట్ ఇచ్చేవి కావు. అందుకే వారు మజ్లిస్ లో పని చేసుకునేవారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అజహర్ కు టిక్కెట్ ఇచ్చినా నవీన్ యాదవ్ కు ఇంచార్జ్ పోస్టు ఇచ్చారు.
మజ్లిస్ తరపున నవీన్ యాదవ్ ఓ సారి పోటీ చేశారు. 2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి .. 9వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ తో అవగాహన కారణంగా టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 2023లోనూ అదే అవగాహన కొనసాగడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు రేవంత్ ఆయన కుటుంబం మాస్ పవర్ పై నమ్మకంతో వారికే టిక్కెట్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ కు చాలా ముఖ్యం. ఉపఎన్నికల్లో గెలిస్తే.. ప్రజాభిప్రాయం.. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని అనుకుంటారు. లేకపోతే.. వ్యతిరేకత ప్రారంభమయిందని చెప్పుకుంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని ప్రయత్నిస్తున్నారు.