జూబ్లిహిల్స్ ఉపఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. నేతలంతా శుక్రవారం నుంచి రోడ్ షోలు ప్రారంభించారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గం ఆరు డివిజన్లలో ప్రతి రోజూ ఎవరో ఒకరు రోడ్ షోతో హోరెత్తించనున్నారు. అంటే.. ప్రచారం ముగిసేవరకూ సాయంత్రం పూట ప్రజలకు చుక్కలు చూపిస్తారన్నమాట. శుక్రవారం రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో సీఎం రేవంత్, కేటీఆర్ ప్రచారం చేశారు. వీరిద్దరిదీ రోడ్ షోస్. ఆ రోడ్ లో వెళ్లిన వారికి కనీసం రెండు గంటల సమయం వృధా అయింది. అత్యవసర పనుల మీద వెళ్తున్నవారు.. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న వారు నరకం అనుభవించారు. లీడర్లు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు.
ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా రోడ్ షోలు
ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎవరూ ఓట్లు వేయరు. కానీ లీడర్లు ఈ విషయాన్ని గుర్తించడం లేదు. తమ రోడ్ షో వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారిని కష్టపెట్టకుండా తమ ప్రచారం చేసుకోవాలన్న ఆలోచన చేయడం లేదు. ట్రాఫిక్ జామ్ అయిపోయి..తమ ప్రసంగం వినడానికి చాలా మంది ఉన్నారని చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అసహనంలో వారి ప్రసంగాలు వినేవారు ఉండరు. వారు చెప్పింది పట్టించుకునేవారు ఉండరు. ఈ విషయాన్ని ఈ లీడర్లు అర్థం చేసుకోలేకపోతున్నారు.
రోడ్ షోలకూ జన సమీకరణే
నిజానికి రోడ్ షోల వల్ల ఫలితాలు మారిపోవు. ఈ రోడ్ షోల దర్పం చూసి ఒక్కరు కూడా ఓటు వేయరు. వారు ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోవడానికి ఈ రోడ్ షోలు కారణం కాదు. కానీ ప్రచారంలో వెనుకబడలేదు అనిపించుకోవాలంటే హడావుడి చేయక తప్పని పరిస్థితి. ఇతర చోట్ల అయితే.. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రచారం చేసుకోవచ్చు. విశాలమైన ప్రాంతాలు రోడ్లు ఉంటాయి. కానీ ఉపఎన్నిక జరుగుతోంది.. సిటీ మధ్యలో ఉన్న నియోజకవర్గం చాలా కొద్ది ప్రాంతంలో ఉన్న ఏరియాలో ఉన్న నియోజకవర్గంలో. ఎటు వైపు ఎటు తిరిగిన అరగంటలో నియోజకవర్గం మొత్తం బైక్ పై తిరిగేయవచ్చు. అలాంటి నియోజకవర్గంలో ప్రచారానికి భిన్నమైన వ్యూహాలు అమలు చేయాల్సింది.
ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తేనే బెటర్ !
జనాభా పరంగా పెద్దది.. వైశాల్యం పరంగా చిన్నది అయిన జూబ్లిహిల్స్ లో ఇంటింటికి ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తే.. పార్టీలకు మేలు జరిగేది. ఇలాంటి రోడ్ షోల వల్ల పార్టీ యంత్రాంగం మొత్తం… ఇంటింటికి వెళ్లడం ఆపేసి.. తమ నేతల రోడ్ షోలకు ప్రాధాన్యం ఇస్తుంది. అది కూడా మైనస్ అవుతుంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆగిపోతుంది. మరో వైపు ప్రజలకూ ఇక్కట్లు ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని గుర్తించి ప్రధాన పార్టీల నేతలు రోడ్ షోలకు స్వస్థి చెప్పి.. ఓపెన్ గ్రౌండ్లకు కార్యకర్తల్ని పిలిపించుకుని తమ ప్రసంగాలు వినిపిస్తే బెటర్. ఎందుకంటే ఇవాల్టి రాజకీయాల్లో నేతల ప్రసంగాలు వినడానికి స్వచ్చందంగా సభలకు వచ్చేవారు దాదాపుగా లేరు.
