జూబ్లిహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. యాభై శాతానికిపైగా పోలింగ్ నమోదు అయింది. గత ఎన్నికల్లో అంటే 2023లో ఇది 47 శాతం వరకే ఉంది. క్యూలైన్లలో ఉన్న వారికి ఆరు గంటల తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. గంట సమయం పెంచడం వల్ల పోలింగ్ శాతం పెరిగినట్లుగా కనిపిస్తోంది. బుధవారం ఉదయానికి పూర్తి పోల్ పర్సంటేజీ బయటకు వస్తుంది.దాదాపుగా 55 శాతం ఓటింగ్ నమోదవ్వొచ్చని అంచనా.
పోలింగ్ మొత్తం చెదురుమదురు ఘటనలతో సాగింది. పలు చోట్ల కాంగ్రెస్ నేతలు రౌడీయిజం చేస్తున్నారని, దొంగ ఓట్లు వేస్తున్నారని, డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఈసీకి ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతూండగానే మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టి ఇవే ఆరోపణలు చేశారు. పోలింగ్ సరళిలో వెనుకబడినట్లుగా అనిపిచండంతో వీరు ఇలా రివర్స్ ఆరోపణలు చేస్తున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
పోలింగ్ శాతం పెరగడం ఎవరికి లాభిస్తుందన్నది ఫలితాల్లో ముఖ్యం. నవీన్ యాదవ్ అనుచరగణం అంతా గట్టిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున నేతలు కూడా బూత్ల వారీగా ఓటింగ్ పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా పోలింగ్ బూత్ల వల్ల బీఆర్ఎస్ శిబిరాలు సందడి లేకుండా ఉన్నాయి. ఇదే ఫలితాలకు సంకేతం అని కొంత మంది భావిస్తున్నారు. ఉపఎన్నికల అవసరం పడే అవకాశం లేదు. పధ్నాలుగో తేదీన ఉదయం పది గంటల కల్లా ఫలితం ఎవరిదో తేలిపోతుంది.

