స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని బెంగాల్ పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. సుప్రీంకోర్టు కూడా వారి ఆవేదనను అర్థం చేసుకుని స్వయంగా పరిశీలనకు న్యాయాధికారుల్ని నియమించారు.అయితే ఆ న్యాయాధికారులనే అక్కడి పార్టీలు వేధిస్తున్నాయి. మాల్దా జిల్లా కలియాచక్లో చోటుచేసుకున్న ఘటన సీజేఐ ఆగ్రహానికి గురైంది. చివరికి ఎన్ఐఏ విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితులు కల్పించింది.
న్యాయాధికారుల నిర్బంధం
మాల్దా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అర్హులైన వారి పేర్లను తొలగించారో లేదో పరిశీలించడానికి ఏడుగురు జ్యుడీషియల్ అధికారుల బృందం వచ్చింది. వారిలో ముగ్గురు మహిళా అధికారులు ఉన్నారు. అయితే. వారిని నిరసనకారులు చుట్టుముట్టి సుమారు తొమ్మిది గంటల పాటు బందీలుగా ఉంచారు. అధికారుల వాహనాలను అడ్డుకోవడమే కాకుండా, వారిని బయటకు వెళ్లనివ్వకుండా నిర్బంధించి భీతావహ వాతావరణాన్ని సృష్టించారు.
అర్ధరాత్రి హైడ్రామా
అధికారులను విడిపించేందుకు స్థానిక పోలీసులు చేసిన ప్రయత్నాలు మొదట విఫలమయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో, అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట సమయంలో భారీ పోలీసు బలగాలు మరియు పారామిలటరీ దళాలను రంగంలోకి దించారు. నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. చివరకు తీవ్ర ఉత్కంఠ మధ్య పారామిలటరీ సిబ్బంది జ్యుడీషియల్ అధికారులను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఆపరేషన్లో పలువురు గాయపడ్డారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సీబీఐ, ఎన్ఐఏ విచారణకు ఆదేశించారు.
ఓవైసీ పనే అంటున్న మమతా బెనర్జీ
న్యాయవ్యవస్థకు చెందిన అధికారులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రతిపక్షాలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మమతా బెనర్జీ మాత్రం ఇది ఓవైసీ పనేనని అంటున్నారు. రాష్ట్రపతి పాలన విధించడానికి బీజేపీతో కలిసి చేస్తున్న కుట్రగా చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యింది, అధికారుల భద్రతపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
